హనుమకొండ, జూలై 8 : కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. బీజేపీ పతనం ఖాయం ‘మోదీ వరంగల్ పర్యటన అని వారం నుంచి బీజేపీ నాయకులు చేసిన హడావుడి చప్పగ మారింది. వరంగల్‌కు వచ్చిన ప్రధాని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై మాట్లాడుతారని అంతా అనుకుంటే మరోసారి మొండి చెయ్యే చూపిండు. 40ఏండ్ల చిరకాల వాంఛ నిజమవుతుందనుకొని ఎదురు చూసిన ప్రజలను నిరాశపరిచిండు.. తెలంగాణ అభివృద్ధికి సహకరించినమని మోదీ అంటున్నడు.. ఈ తొమ్మిదేండ్లలో ఏం సహకరించారో బహిరంగ చర్చకు రావాలి’ అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్‌తో కలిసి శనివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినమోదీ ఖూనీ చేస్తున్నారని, ప్రధానికి, బీజేపీకి చట్టాలపై గౌరవం లేదని మండిపడ్డారు.
నలభై ఏండ్ల చిరకాల వాంఛ నిజమవుతుందని ఎదురుచూసిన వరంగల్ ప్రజలకు ప్రధాని మో దీ మరోసారి మొండిచెయ్యి చూపారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల 60ఏండ్ల కలను నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ నిజం చేసి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు గిరిజన యూనివర్సిటీ విషయంలో పలుమార్లు ప్రధాని మోదీని కలిశామని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పినా ప్రధాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి దేశంలో ఇప్పుడు కోచ్ఫ్యాక్టరీల అవసరమే లేదని చెప్పి అగౌరవపరిచారని గుర్తుచేశారు. అప్పుడు అవసరం లేదని చెప్పి కాజీపేటలో కాదని మూడు నాలుగు నెలలకే గుజరాత్లో ఎందుకు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించామన్న మోదీ, ఈ తొమ్మిదేండ్లలో ఏం సహకరించారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రతి విషయంలో బీజేపీ నాయకులు, ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు, దగాకోరు మాటలు మాట్లాడుతున్నారని చీఫ్‌విప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ప్రజలు తెలంగాణ మోడల్లో తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పటి నుంచే బీజేపీ నాయకులకు దఢ, చలి జ్వరం పుట్టిందని, రాత్రివేళల్లోనూ సీఎం కేసీఆరే వాళ్లకు కలలో వస్తున్నారని ఎద్దేవా చేశారు. సందర్భం ఉన్నా లేకున్నా సీఎం కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఈడీ లాంటి బూచీలను చూపి కేసీఆర్‌ను తెలంగాణకే పరిమితం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ ఈడీలలాంటివాటికి భయపడరన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షల చొప్పున వేస్తామన్నారని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఈ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లాభాల బాటలో ఉన్న ఎల్ఐసీ లాంటి సంస్థలు, పేదలకు ఉపయోగపడే రైల్వే, ఆటో పార్కింగ్ స్థలాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు అమ్ముకుంటుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎందుకు లేవో చెప్పాలన్నారు. ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు చేశారని, తెలంగాణలోనూ అలాంటి కుట్రలు చేయాలని చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారని గుర్తుచేశారు. బీజేపీలో లుకలుకలు, వర్గపోరును సరిదిద్దుకునేందుకే సభ ఏర్పాటు చేశారు తప్ప, వరంగల్ ప్రజలకు ఇచ్చిన వరాలేవీ లేవన్నారు. తెలంగాణలోని గ్రామాలు అద్భుతంగా ఉన్నాయని అవార్డులిస్తూనే ఇక్కడికొచ్చి తిడుతున్నారని ఇది ఏం పద్ధతి అని ప్రశ్నించారు. భద్రకాళి అమ్మవారి పేరు తీసుకొని ప్రధాని మోదీ అపవిత్రమైన మాటలు మాట్లాడారని, అమ్మవారి శాపం బీజేపీకి కచ్చితంగా తగులుతుందన్నారు. చట్టాలను గౌరవించే బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకుసాగుతున్నదని, ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే బీఆర్ఎస్ నినాదం దేశమంతా విస్తరించిందన్నారు. ‘హక్కుల సాధన కోసం పోరాడిన సందర్భంలో 700మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేయడం లేదనడం కన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉంటుందా.. మీరు వచ్చిన హెలికాప్టర్ నుంచి చూసినా తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుంది.. పీఎం స్థాయిలో ఉండి పట్టపగలు పుకిటి పురాణం చదివి వెళ్లిపోతావా?’ అని ప్రశ్నించారు. అవినీతిపరుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిద్రపోతారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని, రాబోవు రోజుల్లో బీజేపీ పతనం ఖాయమని చీఫ్‌విప్ అన్నారు.
ప్రధాని పసలేని ప్రసంగం చేశారు : ఎమ్మెల్యే అరూరి
ప్రధాని మోదీ పసలేని ప్రసంగం చేశారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే మోదీ వరంగల్‌కు వచ్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. తెలంగాణపై, బీఆర్ఎస్పై విషం చిమ్మడమనే ఏకైక ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులిచ్చి, ఇకడకొచ్చి తిట్టడమేమిటని ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీకొట్టడంతో పాటు పథకం పేరు మార్చి ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నది నిజం కాదా అని దుయ్యబట్టారు. తాము చేసే పనులు మంచివి కాకుంటే తమ పథకాలను ఎందుకు కాపీ కొట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. భద్రకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ బంగారు ఆభరణాలు, మాడ వీధుల నిర్మాణం కోసం నిధులిచ్చారని, మరి మీరు భద్రకాళి అమ్మవారికి ఏమిచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటే అది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్పతనమేనన్నారు.
‘తెలంగాణకు చాలా నిధులిచ్చామన్న ప్రధానిని మేం ప్రశ్నిస్తున్నాం.. మీరు మాకు డబ్బులివ్వలేదు.. మాకు న్యాయంగా రావాల్సిన నిధులను ఆపారు.. నీతి అయోగ్ సిఫార్సులను పట్టించుకున్న పాపాన పోలేదు.. మేము మా రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తుంటే మీరు రైతుల బావులకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెచ్చినా మేం పెట్టకపోవడం వల్ల 21వేల కోట్ల రూపాయలు ఆపింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మోదీ కండ్లు మండుతున్నాయన్నారు. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీని ఎందుకు పెండింగ్ పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఎందుకిచ్చారో? చెప్పాలి.. కోచ్ ఫ్యాక్టరీకి మాకు అర్హత లేదా..? బయ్యారం ఉకు ఫ్యాక్టరీ ఎందుకివ్వరు?’ అని ప్రశ్నలు సంధించారు. ‘మాపై బురద జల్లుడు మాని వీటికి సమాధానం చెప్పాలి.. మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈడీ, ఐటీని ఉసిగొల్పుతారు.. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండవచ్చుగాక, మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారన్న సంగతి మరిచిపోవద్దు’ అని అరూరి హెచ్చరించారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ వరంగల్ ప్రజలు చైతన్యవంతులని, అందరి గురించి వారికి తెలుసునని, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ఎంతమాత్రం సహకరించడం లేదన్నారు. స్మార్ట్‌సిటీ కింద రూ.95 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. సమ్మక్క గురించి మాట్లాడిన ప్రధాని మోదీ, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. సమావేశంలో కార్పొరేటర్ బొంగు అశోక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ మిరియాల్‌కార్ దేవేందర్ పాల్గొన్నారు.