రాయపర్తి, ఫిబ్రవరి 20 : నిత్యం ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలు సవ్వడి చేయగా.. పచ్చని పంటలతో కోనసీమను తలపించిన ఆ తండా ప్రస్తుతం చుక్క నీటి కోసం తండ్లాడుతున్నది. పదేండ్ల పాటు సాగు, తాగు నీటికి డోకా లేకుండా బతికిన గిరిజనులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమకు నీటి కష్టాలు దాపురించాయంటూ మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరాంతండా (ఎస్) పరిధి సుక్యాతండావాసులు ఆరు నెలలుగా సాగు, తాగు నీళ్లు లేక అల్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో పదేండ్ల పాటు తండాలోని బీడు భూములన్నీ ఎస్సారెస్పీ, కాళేశ్వర జలాలతో పచ్చని పంట పొలాలుగా మారాయని ప్రజలు చెబుతున్నారు. మిషన్ భగీరథతో తాము తాగు నీటి కోసం వ్యవసాయబావుల వద్దకు వెళ్లిన రోజులు మరచిపోయామంటున్నారు.
అయితే రేవంత్రెడ్డి పాలన మొదలైనప్పటి నుంచి అనేక ఇబ్బందులతో కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఆరు నెలలుగా మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడి తాగు నీరంతా వృథాగా పోతున్నదని, మరమ్మతు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో మిషన్ భగీరథ నీరు రాక ఇండ్ల ముందున్న నల్లాలు అలంకారప్రాయంగా మారాయన్నారు.
గుక్కెడు నీళ్ల కోసం మళ్లీ ఆడబిడ్డలంతా వ్యవసాయ బావుల వద్దకు బిందెలతో వెళ్లాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావులు సైతం అడుగంటాయని, పదేండ్ల తర్వాత క్రేన్లతో పూడికతీస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి సాగు, తాగు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
కేసీఆర్ సారు సల్లంగుండా.. ఆయన ఉన్నన్నాళ్లు మాకు నీళ్లకు ఏ గోస లేకుండె.. సారూ గిట్ల కుర్సీ దిగిపోయిండో లేదో మళ్ల మా బతుకుల్ల మన్నుబడ్డట్టు అయింది. ఆర్నెళ్ల సంది ఇంటి ముందున్న నల్లాల నుంచి సుక్క నీరు వత్తలేదు. ఎవరిని అడిగినా ఏం చెప్తలేరు. మేమేమో చాతగాని ముసలోల్లం. బాయిల కాడ నుంచి తెచ్చుకుందామంటే పంటలకే నీళ్లు సరిపోతలేవని ఎవరూ రానిస్తలేరు. ఈ నాలుగేండ్లు ఎట్ల బతుకుడో అర్థమైతలేదు. బంగారం లాంటి కేసీఆర్ సారును వదులుకొని పెద్ద తప్పు చేసినమని చెంపలేసుకుంటున్నం.
– గుగులోత్ కోట్యానాయక్
కేసీఆర్ ప్రభుత్వం ఉన్న కాలంల నా వ్యయసాయ బాయి ఎప్పుడూ నిండుగా ఉండేది. ఇప్పుడు కాల్వల నీళ్లు రాకపోవడంతో బాయిల పైర్లకు సరిపడా నీరు ఊరుతలేదు. దీంతో రూ. 25 వేలు పెట్టి నల్గొండ జిల్లా నుంచి క్రేన్, కార్మికులను తీసుకొచ్చి పూడిక మట్టి తీయిస్తున్న. కాంగ్రెస్ సర్కార్ కోసం ఎంత తండ్లాడినమో.. ఇప్పుడు అంత కంటే ఎక్కువనే కష్టాలు అనుభవిస్తున్నం.
– గుగులోత్ బక్కులునాయక్
నాకున్న ఎకరంనర వ్యవసాయ భూమిలో ఈ కాంగ్రెస్ సర్కార్ పనితీరు చూసి వరి పంట కు బదులు మక్క జొన్న సాగు చేసిన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మక్కజొన్న చేనుకు కూడా సరిపడా నీళ్లు బాయిల ఎల్లుతలేవు. చేను ఇప్పుడిప్పుడే కంకులు పెడుతున్నది. నీళ్లు లేక పొట్టకొచ్చిన చేను కండ్ల ముందే ఎండిపోతుంటే పాణం తండ్లాడుతున్నది.
– గుగులోత్ రాములు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రా మం మాది. మా కుటుంబాలన్నీ ఎనుకటి నుంచి వ్యవసాయ బావులు తవ్వుడు, పూడికలు తీసుకుంటనే బతుకుతున్న యి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక మా క్రేన్లు, పనులు అన్నీ మూలనపడ్డయి. మళ్లా ఇప్పుడిప్పుడే క్రేన్లకు గిరాకీ మొదలైంది. బాయిల పూడిక తీసినా నీళ్లు ఊరే పరిస్థితి కన్పిస్తలేదు.
– శివరాత్రి భాగ్యమ్మ, క్రేన్ కార్మికురాలు, సిరిపురం, యాదాద్రి భువనగిరి