ఒకప్పుడు నిత్యం వేలాది మంది రాకపోకలతో కిటకిటలాడే వరంగల్ నగర రహదారులు, కూడళ్లు.. ఇరుకుగా, అడుగడుగునా గుంతలు, చిన్నపాటి వర్షం పడితేనే వరద నీటితో జలమయమై ప్రజలకు చుక్కలు కనిపించేవి. స్థానికులే గాక వివిధ జిల్లాల నుంచి వ్యాపార నిమిత్తం ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే చిరువ్యాపారులు, లెక్కకు మించి వాహనాలతో ఇక్కడి రోడ్లన్నీ నిండిపోయి గజిబిజిగా ఉండేది. ఇక ముఖ్యమైన పండుగ సమయాల్లో జనం రద్దీతో ట్రాఫిక్ మొత్తం స్తంభించి ఏ వాహనం ఎటువైపు వెళ్తున్నదో తెలియని పరిస్థితి ఉండేది.
ఇలా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉమ్మడి జిల్లాకేంద్రంలోని చౌరస్తాలు మాత్రం అభివృద్ధి నోచుకోక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు చొరవతో నగరరోడ్లకు మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో రహదారుల విస్తరణ, కూడళ్ల సుందరీకరణతో ఇప్పుడు ప్రధాన రహదారులు, జంక్షన్లకు కొత్తకళ వచ్చింది. ఎంజీఎం రోడ్ టూ పోచమ్మమైదాన్, ఎస్వీఎన్ రోడ్డు, జేపీఎన్, మేదరివాడ, స్టేషన్రోడ్డు, కాశీబుగ్గ వరకు ఉన్న రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. రోడ్లు విశాలంగా మారి ట్రాఫిక్ సమస్యలు కూడా తప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– ఫొటోగ్రాఫర్, వరంగల్
రోడ్లు విశాలంగా ఉన్నాయి..
ఇదివరకు మేదరివాడలో రోడ్డు ఇరుకు ఇరుకుగా ఉండేది. వర్షాకాలం రాగానే డ్రైనేజీ నీరు, వరద నీరు చేరి రెండు రోజుల దాకా అలాగే ఉండి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు సీసీ రోడ్డు వేయడం వల్ల వాహనాలకు ఎలాంటి ఇబ్బందు ల్లేవు. వర్షం పడ్డా నీరు నిలవడం లేదు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రోడ్లను మంచిగ చేస్తున్నరు.
– కూచనపెల్లి వసంతకుమార్, స్థానికుడు, మేదరివాడ