సంప్రదాయ చీరకట్టులో.. పట్టు పరికిణీల్లో తెలుగుదనం ఉట్టిపడే సంప్రదాయ వేషధారణలో హొయలు పోతూ సుందరీమణులు మెరిసిపోయారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా మిస్ట్ వరల్డ్ కాంటెంటెస్టల్లో బుధవారం ఒక బృందం వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్‌లో, మరో బృందం రామప్ప ఆలయాన్ని సందర్శించింది.
హైదరాబాద్ నుంచి సాయంత్రం చేరుకున్న ఈ అందగత్తెలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటలు, కోలాటాలు ఆడి సందడి చేశారు. ఆలయ శిల్పకళకు ముగ్ధులైన విదేశీ యువతులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి పూజల్లో పాల్గొని కొత్త అనుభూతికి లోనయ్యారు. కాకతీయుల శిల్ప సంపద అద్భుతం.. హిస్టారికల్ టెంపుల్ థౌజండ్ పిల్లర్స్, బ్యూటీఫుల్ టెంపుల్.. ఓం నమఃశివాయ అంటూ కితాబునిచ్చారు.
– వరంగల్/హనుమకొండ/హనుమకొండ చౌరస్తా/ వెంకటాపూర్, మే 15
వరంగల్ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం 4.42 గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌కు 20 మంది అందగత్తెలు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా పర్యాటక శాఖ బి-2 బస్సులో అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కెనడా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, ఎల్ సాల్వేడార్, గ్వాటేమాల, హైతీ, హోండూరస్, మెక్సికో, నికరాగ్వా, పరాగ్వే, పనామా, పెరూ, అమెరికా, సూరి నామ్, వెనుజుల, బెలిజ్ దేశాలకు చెందిన సుందరీమణులు రాగా వీరికి హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజి వాకేడేలు, డీసీపీ సలీమా, అధికారులు బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు.
హోటల్ వద్ద బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు. తెలంగాణ చీరకట్టు, లంగావోని, బొట్టుతో ముస్తాబై వేయిస్తంభాల ఆలయానికి చేరుకోగా వారికి ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఆలయ ఈవో అనిల్‌కుమార్, ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్‌శర్మ స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ఉన్న కోనేరును, వేయిస్తంభాల ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే శిలాశాసనాన్ని పరిశీలించారు. శిలాశాసనంలో ఉన్న ఆలయ చరిత్రని వారికి గైడ్ వివరించారు. నందీశ్వరుడి సన్నిధిలో ఫొటోలు తీసుకున్నారు.
18
కోటలో అందాల భామల హెరిటేజ్ వాక్ ఓరుగల్లు కోటలోని కాకతీయ శిల్పాల మధ్య ప్రపంచ సుందరీమణులు హెరిటెజ్ వాక్ చేశారు. సాయంత్రం 7.25 గంటలకు పశ్చిమ ద్వారం నుంచి కీర్తితోరణాల్లోకి చేరుకున్న అందాల భామలకు వరంగల్ ప్రత్యేక ఉత్పత్తి చపాట మిర్చి ఇచ్చి స్వాగతం పలికారు. వరంగల్ చపాట మిర్చి, పసుపు ఉత్పత్తుల స్టాల్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొత్తవాడ దర్రీ, రంగశాయిపేట హస్తకళల ప్రదర్శనను తిలకించి అబ్బురపడ్డారు.
స్టాళ్ల వద్ద సెల్ఫీలు దిగారు. అక్కడి నుంచి శిల్పాల మధ్య నడుచుకుంటూ ఒక్కో శిల్పాన్ని తిలకించగా వాటి విశిష్టతను టూరిజం గైడ్ వివరించారు. 20 మంది ప్రపంచ సుందరీమణులు చీర కట్టు, ముంజేతి గాజులు, నుదుట సిందూరంతో ఆకట్టుకున్నారు. సుమారు గంటన్నర పాటు కీర్తితోరణాల మద్య గడిపారు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీరనారి రాణీరుద్రమదేవి పరాక్రమాన్ని వివరించే కూచిపూడి నృత్యంతో పాటు పేరిణి నృత్యం ఆకట్టుకుంది. నృత్య ప్రదర్శనలను ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. మంత్రి కొండా సురేఖ రాక కోసం అధికారులు లైట్ అండ్ సౌండ్ షోను నిలిపివేశారు.
కాకతీయుల రాజ్య చరిత్ర, వీరత్వాన్ని వివరించే షో మొదలువుతుందని వ్యాఖ్యాతలు ప్రకటించి లైట్లు ఆర్పివేశారు. అయితే అప్పటి వరకు మంత్రి రాలేదన్న విషయం తెలుసుకున్న అధికారులు ఆమె వచ్చిన తర్వాత 7.54 గంటలకు షోను ప్రారంభించి 10 నిమిషాల పాటు ప్రదర్శించారు. సుందరీమణులు సందర్శించి కీర్తితోరణాల ప్రాంతాలను పోలీసులు నాకా బందీ చేశారు. రహదారులను మూసివేయడంతో పాటు బయటి వ్యక్తులు తిలకించే అవకాశం దక్కలేదని స్థానికులు నిరాశచెందారు. కాగా అందగత్తెలు రాత్రి 9.20 గంటలకు హరిత హోటల్‌కు డిన్నర్ ముగించుకొని 10.54 గంటలకు హైదరాబాద్ పయనమయ్యారు.
ఇక మరో బృందం 33 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ముందుగా కాటేజీ, సరస్సు వద్ద సంప్రదాయ చీర కట్టులో గ్రూప్ ఫొటోలు దిగి మురిసిపోయారు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో ఆలయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, ఇతర అధికాలు కలిసి స్వాగతం పలికారు.
అక్కడినుండి గొత్తికోయ న్యత్యం నడుమ ఆలయంలోకి ప్రవేశించారు. గైడ్ ద్వారా ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత్య తెలుసుకొన్నారు. అనంతరం పేరిణి న్వత్యం, అలేఖ్య గ్రూప్ నృత్యం, రాణీరుద్రమ దేవి చరిత్ర, సౌండ్ అండ్ లైట్‌షోలో ఆలయ నిర్మాణం తీరును, కాకతీయ, రామప్ప చరిత్రను వివరించారు. సుందరీమణులకు మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్లో డిన్నర్ చేసి తిరుగు ప్రయాణమయ్యారు.