కాశీబుగ్గ, అక్టోబర్ 3 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ లేబర్‌కాలనీ జంక్షన్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ కేటీఆర్‌పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలకు శాశ్వతంగా దూరమవుతానన్నారు. వరంగల్ జిల్లా అంటే రాణి రుద్రమదేవి పౌరుషమని, అలాంటి గడ్డ పరువు, ప్రతిష్టను దిగజారుస్తున్నారని అన్నారు. సినీ హీరో నాగార్జున కుటుంబాన్ని అవమానపర్చడం, ఇతర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆరోపణలు విరమించుకోకుంటే ఇక ముందు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, మరుపల్లి రవి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.