నమస్తే నెట్వర్క్ : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు ర్యాలీలు నిర్వహించి ప్రధాన కూడళ్లలో మానవహారాలు చేపట్టారు. స్వచ్ఛదనం-పచ్చదనంపై అవగాహన కల్పించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సురేఖ, ములుగు జిల్లా అబ్బాపురంలో మంత్రి సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంజీఎం సెంటర్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పీ ప్రావీణ్య, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషన్ అశ్విని తానాజీ వాకడే తదితరులతో కలిసి సురేఖ రోడ్డు ఊడ్చారు. అబ్బాపురంలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి మొక్క నాటిన అనంతరం మంత్రి సీతక్క ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.