ఏటూరునాగారం, అక్టోబర్ 24 : ఆదివాసీ సమాజం కోసం కుమ్రం భీం త్యాగాలు, పోరాటం స్ఫూర్తిదాయకమని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్లో గురువారం కుమ్రం భీం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ భీం నినాదం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఒక వైపు గోదావరి, మరో వైపు అడవులున్నాయన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో దండారి పండుగకు ప్రభుత్వం రూ. 1.5కోట్లు కేటాయించిందన్నారు. ఐటీడీఏలపై సీఎంతో మీటింగ్‌ను ఆదివాసీ సంఘాలతో ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీడీఏలు ప్రత్యేకంగా గిరిజనుల కోసం ఏర్పాటయ్యాయని, కేంద్రం నుంచి కూడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల భవనాలు శిథిలావస్థలో ఉన్నందున కొత్తగా నిర్మాణం చేసేందుకు ఎస్టిమేషన్లు ఇవ్వాలని పీవోలను కోరినట్లు తెలిపారు. ఐటీడీఏ ద్వారా ఇందిరమ్మ ఇండ్లను అట్టడుగు వర్గాలకు అందించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఐఏఎస్ అధికారి దివ్యను ఐటీడీఏ ప్రాంతాల అభివృద్ధిపై ఇన్చార్జిగా నియమించేందుకు సీఎం ఆలోచనలో ఉన్నారన్నారు. వెనుకబడి ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమానికే ఐటీడీఏలున్నాయని, సంఘాలు ఏవైనా అవసరం ఉంటే తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఏపీలోని అరకు ఎమ్మెల్యే రేగా మచ్చెలింగం, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, మైపతి అరుణ్‌కుమార్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, భీం విగ్రహ ప్రతిష్టాపన అధ్యక్షుడు చెరుకుల ధర్మయ్య, గౌరవ అధ్యక్షుడు నల్లబోయిన కోటయ్య, ప్రధాన కార్యదర్శి ఈసం నర్సయ్య, ఇర్ప కేశవరావు, తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ పొడెం రత్నం, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆలం భిక్షపతిరావు, పులుసం నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.