తాడ్వాయి/వెంకటాపూర్/గోవిందరావుపేట, ఆగస్టు4: మేడారం శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి అక్టోబర్ తర్వాత ముందస్తుగా పనులను చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్ జీ, ఓఎస్డీ మహేశ్ బాబా సాహెబ్ గీత, డీఎఫ్‌వో రాహుల్కిషన్జాదవ్, ఆర్డీవో సత్యపాల్‌రెడ్డితో కలిసి మేడారంలో పర్యటించారు. ముందుగా భక్తుల వసతి గృహాల వద్ద స్థానిక రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేసి మొక్కలు నాటారు. తాడ్వాయి మండలంలోని 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, గోవిందరావుపేటలో సీఎంఆర్ఎ ఫ్ చెక్కులను అందజేశారు.
అదేవిధంగా ఎన్ఐటీలో సీట్లు పొందిన 11 మంది విద్యా ర్థులకు రూ. 3,62,598 విలువ గల చెక్కు లను పంపిణీ చేశారు. వెంకటాపూర్ మండ లం నందిపాడు గొత్తికోయగూడెంలో నిర్మా ణ్ సంస్థ, ఆడమా మద్దతుతో స్వచ్ఛ మైన తాగునీటికోసం బోర్వెల్, వాటర్, ట్యాంక్, కమ్యూనిటీ టాయిలెట్స్, కమ్యూనిటీ షెడ్, స్ట్రీట్ లైట్స్, జంతు నీటి ట్యాంకులు, ఇండ్ల కోసం లైటింగ్‌ను ప్రారంభించారు. తాడ్వాయి ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో కలిసి మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గత జాతరలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రామంతో పాటు ఆ గ్రామ ఇన్చార్జి అధికారికి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సన్మానం చేస్తామన్నారు.
జాతీయ రహదారిని సమ్మక్క-సారలమ్మ కారిడార్‌గా అభివృద్ధి చేసి వివిధ ప్రాంతాలు, పార్కింగ్ స్థలాల్లో జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రదేశాల గురించి తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. కాల్వపల్లి, ఊరట్టం నుంచి వచ్చే రహదారిని రూ.12కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గద్దెల ప్రాంగణం నుంచి జంపన్న వాగు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో దాతల సహకారం గొప్పదని కొనియాడారు. కొద్ది రోజుల క్రితం తక్కల పాడు గ్రామంలో ఒక బాలిక పాఠశాల నిర్మాణం చేయాలని కోరగా, తాను జిల్లా అధికారులకు చెప్పగా కలెక్టర్, ఎస్పీ స్పందించి 15 రోజుల్లోనే పాఠశాల నిర్మాణం చేసి ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవోలు రాజు, సుమనావా ణి, ఎస్సై సతీశ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.