కన్నాయిగూడెం, సెప్టెంబర్ 17 : బంగారుపల్లి తరహాలో మరో మూడు చోట్ల కంటెయినర్ స్కూళ్లను ఏర్పాటుచేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో రూ.13.50 లక్షలతో ఏర్పాటుచేసిన రాష్ట్రంలోనే మొదటి కంటెయినర్ పాఠశాలను మంగళవారం ఎంపీ బలరాంనాయక్, టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
నిర్మాణాలకు వీలు లేకుండా అటవీ శాఖ నిబంధనలు ఉండడం వల్ల ఇలా ఏర్పాటు చేశామని చెప్పారు. గిరిజనుల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ఈ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీఈవో పాణిని, మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, ఓఎస్డీ మహేశ్బాబా సాహెబ్ గీతె, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, ఎంపీడీవో అనిత, తహసీల్ద్దార్ సలీం పాల్గొన్నారు.