జయశంకర్భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని చెల్పూర్లోని టీఎస్ జెన్కో సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇక్కడ మంత్రి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వేచేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ బృందాలను కేటాయించాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒకరికీ పట్టాలు అందించి హకు కల్పించేందుకు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంగా గ్రామ కమిటీలతో సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నియమించిన ఫారెస్ట్ రైట్ కమిటీలు, అర్హుల జాబితాను సిద్ధం చేసి గ్రామ పంచాయతీ తీర్మానంతో సబ్ డివిజనల్ కమిటీ ద్వారా జిల్లా స్థాయి కమిటీలకు పంపాలని సూచించారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రా మాట్లాడుతూ మంత్ర సారథ్యంలో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, ఐటీడీఏ అధికారులు సభ్యులుగా ఉంటారని, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. జిల్లాలో 25,021 అర్జీలు వచ్చాయన్నారు. వీటి పరిషారానికి ఫారెస్ట్ రైట్స్ కమిటీలు తోపాటు జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే నిర్వహించేందుకు 92 జీపీల్లోని 172 హ్యాబిటేషన్లలో బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు సర్వే చేసి త్వరగా పూర్తి చేస్తామన్నారు.
ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
– గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే భూపాలపల్లి
పోడు భూముల పట్టాలు అర్హులైన ప్రతి ఒకరికీ అందించే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అటవీ సంపదను కాపాడుకోవడంతో పాటు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ శాఖ అధికారులపై ఉందన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కొత్త చట్టం తో పొడు భూములుపై ఆధారపడిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య, ఏటూర్‌నాగారం ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ సురేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ కే శోభ, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.