హనుమకొండ, ఆగస్టు 6 : వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, సర్కారు ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్షించారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్టైల్ పారు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ సూల్స్ తదితర అంశాలపై చర్చించారు.
అంశాలవారీగా అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీపడొద్దన్నారు. వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కోసం రైతులు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఎయిర్ పోర్ట్ భూసేకరణకు ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మంత్రి ఆదేశించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 20లోగా కాళోజీ కళాక్షేత్రం పనులు పూర్తి చేయాలని, వచ్చే నెలలో సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే చారిత్రక భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాలన్నారు. మాడవీధుల నిర్మాణంతో పాటు ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పారు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ పార్కులో మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అలాగే సీఎం సమయం తీసుకుని నర్సంపేట మెడికల్ కాలేజీని ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తామని వెల్లడించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మారుమూల ప్రాంతాల్లో పేదప్రజలకు వైద్య సేవలు అందేలా డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూను ఆదేశించారు. ఖమ్మం, వరంగల్ మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన భూమిని సేకరించాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కే నాగరాజు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, ఆర్అండ్బీ శాఖ కార్యదర్శి హరిచందన, సీడీఎంఏ వీపీ గౌతమ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, పీ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.