మహిళా దినోత్సవాన మంత్రి రామన్న కానుక తొర్రూరులో మొత్తం రూ.1550 కోట్ల మేర రుణాలు, అభయహస్తం చెక్కుల పంపిణీ మున్సిపాలిటికీ రూ.25కోట్లు.. కొడకండ్లలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఉత్తర్వులు 500 మంది మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ యతిరాజారావు పార్కు, సమీకృత మార్కెట్‌కు ప్రారంభోత్సవం దయాకర్‌రావు పనితీరుతోనే జాతీయ అవార్డులు దేశం మెచ్చిన పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో అమాత్యుడు రామన్న ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.1550కోట్ల విలువజేసే వడ్డీలేని రుణాలు, అభయహస్తం చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. పాలకుర్తిలో పైలట్ ప్రాజెక్టు కింద శిక్షణ పొందిన 500 మందికి ఉచితంగా కుట్టుమిషన్లను అందించారు. ఈ సందర్భంగా సుమారు 20వేల మందికిపైగా మహిళలతో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దేశం మెచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన పనితీరుతోనే తెలంగాణకు జాతీయ అవార్డులు వచ్చినయ్’ అని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎర్రబెల్లిని పాలకుర్తి ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో యతిరాజారావు పార్కు, సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు. కేటీఆర్‌కు స్థానికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

తొర్రూరు, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆర్థిక భరోసా కల్పించారు. తొర్రూరులో రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు మొత్తం రూ.1550కోట్ల విలువజేసే వడ్డీలేని రుణాలు, అభయహస్తం చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఇందులో వడ్డీ లేని రుణాలు రూ.750కోట్లు, అభయహస్తం డబ్బు రూ.595.43 కోట్లు, స్త్రీనిధి కింద రూ.50.69కోట్లు, పాలకుర్తి నియోకవర్గానికి చెందిన బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.204కోట్ల చెక్కులను సభా వేదికపై మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. అంతేకాకుండా 500 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ ‘ఎర్రబెల్లి ఏడు సార్లు ఓటమి ఎరుగకుండా గెలిచాడు.. నా కంటే రాజకీయాల్లో అనుభవజ్ఞుడు. ఆయన పనితీరుతో ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి మంచి పేరు తెచ్చిండు. దేశంలోనే అత్యత్తుమ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చరిత్ర సృష్టించాడు’ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో అవార్డులు ప్రకటిస్తే పంచాయతీరాజ్ శాఖ 99 శాతం కైవసం చేసుకోవడం దయాకర్‌రావు పనితీరుకు నిదర్శనమన్నారు. ‘సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన’ పథకంలో అత్యుత్తమైన 20 పంచాయతీలను ఎంపిక చేస్తే, వాటిలో 19 తెలంగాణకు చెందినవి కావడం.. ఆరు నెలల్లో 2 త్రైమాసికాలకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ విభాగాల్లో త్రీ స్టార్, ఫోర్ స్టార్ ర్యాంకుల్లో దేశంలో ఆరు జిల్లాలను ఎంపిక చేస్తే, అందులో తెలంగాణ నుంచే 4 జిల్లాలు ఉండడం గర్వకారణమన్నారు. ఇంతమంచి పరిపాలనా దక్షత కలిగిన మంత్రి దయాకర్‌రావును పాలకుర్తి ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని సూచించారు. ‘దయాకర్‌రావుకు గత ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలు 56 వేల మెజార్టీ ఇచ్చారు, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి అభిమానాన్ని చాటుకోండి’ అని పిలుపునిచ్చారు.
బతుకుదెరువు కోసం సూరత్, షోలాపూర్, భీమండి వంటి ప్రాంతాలకు వలస పోయారని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి కోరడంతో కొడకండ్లలో 20ఎకరాల్లో మినీ టెక్స్టైల్ పార్క్ కోసం సభా వేదికపైనే జీవో ప్రతిని ఎర్రబెల్లికి అందించారు. తొర్రూరు మున్సిపాలిటీకి రూ.25కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొర్రూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల స్థాయికి, పాలకుర్తి దవాఖానను 50 పడకల స్థాయికి పెంచేలా బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ‘మీరు అడగకున్నా పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా మంత్రి దయాకర్‌రావు రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకొని మొదటి విడుతలో రూ.5కోట్ల 10లక్షలతో 3వేల మందికి ఉచిత కుట్టు శిక్షణ ఇప్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 1000 మందిలో 500 మంది మహిళలకు నా చేతుల మీదుగా కుట్టు మిషన్లు ఇప్పించడం ఎంతో ఆనందాన్నిచ్చింది.’ అన్నారు. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాలకు పావలావడ్డీ రుణాలు, అభయహస్తం నిధుల సమకూర్చి, స్త్రీ నిధి రుణాల రూపంలో మహిళా దినోత్సవం రోజునే రూ.1550 కోట్ల విలువైన చెక్కులను జారీ చేసే ప్రక్రియను ప్రారంభించడం మహిళల అభ్యున్నతి పై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని చెప్పారు.

తొర్రూరుకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. పార్కు ప్రారంభోత్సవం సమయంలో నృత్యాలతో విద్యార్థులు, పూలతో చిన్నారులు స్వాగతం పాలికారు. అనంతరం పార్కును ప్రారంభించిన మంత్రి బుద్ధుడి విగ్రహానికి పూలమాల వేశారు. మహిళలు మార్కెట్ వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ తీశారు. కోలాటం, నృత్యాలు, బోనాలు, బతుకమ్మలతో సాదర స్వాగతం పలికారు. దారి వెంట ప్రజలకు అభివాదం తెలుపుతూ రామన్న వారిలో ఉత్సాహం నింపారు. మార్కెట్లో మంత్రిని మహిళలు గజమాలతో స్వాగతించారు.
మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్టీఆర్, కేసీఆర్ లాంటి సీఎంలను చూడలేదు. నాడు ఎన్టీఆర్ డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళల్లో చైతన్యం తెస్తే, నేడు సీఎం కేసీఆర్ స్వయం సహాయక సంఘాలకు భారీగా నిధులిస్తూ అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా ప్రోత్సాహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.500 నుంచి రూ.600కు మించి పింఛన్లు ఇవ్వడం లేదు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులకు తప్ప అర్హులైన వాళ్లందరికీ రూ.2016 పెన్షన్ ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లాలు పెట్టించి శుద్ధ జలాలలను ఇస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపి సస్యశ్యామలం చేస్తాం. తొర్రూరు పట్టణంలో ఇప్పటికే రూ.125కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా నూతన మున్సిపాలిటీ భవనం, మినీ ట్యాంక్‌బండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నది. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు, కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు.
ఆడబిడ్డల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని మహిళలంతా పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పాలకుర్తి నుంచే వడ్డీలేని రుణాల పంపిణీని ప్రారంభించడం ఇక్కడి మహిళల అదృష్టం. ఈ జిల్లాలో పుట్టిన నేను సామాన్య మహిళగా వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి మంత్రిగా ఎదిగాను. నాడు ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశమిస్తే నేడు సీఎం కేసీఆర్ మంత్రిగా అవకాశమిచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అమలు చేయడం సంతోషదాయకం. జిల్లా అభివృద్ధిపై రామన్న ప్రత్యేక చొరవ చూపుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోం తొర్రూరుకు రావడం ఆనందంగా ఉంది.
సభ అనంతరం సమీకృత మార్కెట్‌ను మంత్రి ప్రారంభించి, వ్యాపారులతో ముచ్చటించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్‌ను వ్యాపారులు సన్మానించే ప్రయత్నం చేయగా తిరిగి శాలువాలతో వారినే మంత్రి సన్మానించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడే స్టాల్లో ఉన్న బీజేపీ కౌన్సిలర్ కొలుపుల శంకర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ బీజేపీ నాయకుడు అయినా మార్కెట్లో స్టాల్‌ను కేటాయించడం మంత్రి దయాకర్‌రావు చేస్తున్న పనులకు నిదర్శనమని అభినందించారు.

‘తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్’ అంటూ మంత్రి దయాకర్‌రావు బహిరంగ సభలో వ్యాఖ్యానించగా ఒక్కసారిగా మహిళలు చప్పుట్లు కొడుతూ సీఎం.. సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సీఎం కేటీఆర్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు రూపొందించిన ప్లకార్డులను ప్రదర్శించారు.