కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. సర్కారు విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నది. వారిలో ఆసక్తిని పెంపొందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 37 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి రూ.9 కోట్లు అంచనాతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రీనరీతో గ్రౌండ్లు, మరుగుదొడ్లు, భోజన గదులు నిర్మిస్తున్నారు. తొలి విడుతలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి.
హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాలలో కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ అదరహో అనిపిస్తోంది. విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆసక్తి పెంపొందేలా సైన్స్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టేలా.. ఆలోచనలు రేకెత్తించేలా.. సైన్స్‌పై ఆసక్తి కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలుచేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని సర్కారు బడులను ఆధునీకరిస్తున్నది. డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నది. తొలి విడుతలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టగా హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాలలో రూ.70 లక్షలతో ఏర్పాటుచేసిన సైన్స్ పార్క్ అబ్బురపరుస్తోంది. ఇందులోని టెలిస్కోప్, గ్లోబ్ తదితర పరికరాలు విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సైన్స్ పార్క్‌ను ఈ నెల 5న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
– వరంగల్, మే 2
పనులు పూర్తి..
గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు రూ. 70 లక్షలతో ప్రాక్టీసింగ్ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాల మైదానంలోని సైన్స్ పార్క్‌లో పరికరాలను ఏర్పాటు చేశారు. పార్క్ గోడలపై సైన్స్ బొమ్మలు, శాస్త్రవేత్తల పేర్లను పెయింటింగ్ చేశారు. టెలిస్కోప్, గ్లోబ్, యూనిక్ కలర్రింగ్ లాంటి 17 రకాల పరికరాలను పొందుపరిచారు. 8,9,10 తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించిన సైన్స్ పరికాలు, సుమారు 20 మంది విద్యార్థులు డ్రాయింగ్ చేసుకునేలా అంఫీ థియేటర్‌ను రూపొందించారు. థియేటర్లో పెద్ద పెద్ద బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. పార్క్‌లో గ్రీనరీతో పాటు ఫుట్‌పాత్‌లకు టైల్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సీటింగ్ ఏర్పాటు చేశారు.
5న ప్రారంభం..
మంత్రి కేటీఆర్ చేతులమీదుగా సైన్స్ పార్క్‌ను ప్రారంభించేందుకు బల్దియా అధికారు లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 5న నగరానికి రానున్న కేటీఆర్ సైన్స్ పార్క్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులను పూర్తి చేసిన అధికారులు పార్క్‌ను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.