ములుగు, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయం 10:15 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. కళాశాల పకనే రూ.65 కోట్లతో నిర్మించనున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. దాని పకనే రూ.38.50 కోట్లతో జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. అదేప్రాంతంలో రూ.10.40 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలకు శంకుస్థాపన చేస్తారు. సమీకృత కలెక్టరేట్ ఎదురుగా రూ.1.25 కోట్లతో నిర్మించే మోడల్ బస్టాండ్‌కు, రూ.50 లక్షలతో బండారుపల్లి శివారులో నిర్మించే సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని కోట్లతో జిల్లాలో నిర్మించిన ఐదు పోలీస్స్టేషన్ల భవనాలను మంత్రి ప్రారంభిస్తారు.
Mulugu
జిల్లా పర్యటనలో కేటీఆర్ రోడ్డు మార్గాన ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని శిల్ప సంపదను తిలకించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్ప చెరువు కట్ట వద్దకు చేరుకొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి, అకడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్ హాల్ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. 10 వేల మంది హిప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభిస్తారు. జిల్లాలోని లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేస్తారు. రూ.200 కోట్ల విలువైన చెక్కులు, ఆస్తి పత్రాలను జిల్లా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించుకొని శాశ్వత పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న ములుగు మండలంలోని లబ్ధిదారులకు పట్టాలను చేస్తారు. జిల్లాలోని లబ్ధిదారులకు ఇటీవల మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెకులను పంపిణీ చేస్తారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా గ్రూపులకు డీఆర్డీఏ నుంచి మంజూరైన రుణాల చెకులను అందజేస్తారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆతర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగు పయనమవుతారు. మంత్రి కేటీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పాల్గొంటారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు హాజరయ్యే లబ్ధిదారులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజనం కూడా అందించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గౌస్ఆలం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.