అన్నా అంటే నేనున్నా’ అని స్పందించే అద్భుతమైన నాయకుడు దాస్యం వినయ్‌భాస్కర్, మీ అందరి అభిమాన నాయకుడు నన్నపునేని నరేందర్‌ను మరోసారి ఆశీర్వదించి రికార్డు మెజార్టీతో గెలిపించాలి’ అని వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ, సంక్షేమ సభల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి రామన్న మాట్లాడారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ వైపా.. స్కాములు, అబద్ధాలు, మోసాలతో కాలం గడిపే బీజేపీ, కాంగ్రెస్లవైపా తేల్చుకోవాలని కోరారు.
-వరంగల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) వరంగల్ (నమస్తే తెలంగాణ)
వరంగల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వరంగల్ (నమస్తే తెలంగాణ) : ‘ఉద్యమ సమయంలో ఓరుగల్లే కదనరంగమైంది. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఏ పిలుపు ఇచ్చినా ఈ గడ్డ కదలివచ్చింది. ఉద్యమానికి, బీఆర్ఎస్కు ఊపిరిలూదింది.. ఉద్యమానికి కేంద్రబిందువైంది.. మొదటినుంచీ అండగా ఉంటున్న ఈ గడ్డ ప్రజలకు సర్వదా శతదా..రుణపడి ఉంటం’ అంటూ వినమ్రతతో ప్రసంగించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆగం కావద్దని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. హనుమకొండలోని హయాగ్రీవాచారి మైదానంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ, సంక్షేమ సభల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి రామన్న పాల్గొన్నారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ రూ.900కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించుకున్నామని చెప్పారు.
ఎన్నికలు అనగానే సంక్రాంతి గంగిరెద్దుల్లా ప్రతిపక్షాలు వస్తున్నాయని, ఎన్నడూ తెలంగాణపై గుండెల మీద ప్రేమతో లేని కాంగ్రెస్, బీజేపీని నమ్మవద్దని కోరారు. కరెంటు, సాగునీరు, మంచినీళ్లు, రైతుబంధు, ఆసరా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, డబుల్బెడ్రూం, దళితబంధు, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. 60 ఏండ్లు తెలంగాణను పీక్కుతిన్న కాంగ్రెస్, మోసాలు చేసే బీజేపీ బేకార్గాండ్లు అటువైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు పేద ప్రజలంటే పట్టరని, కులాలు, మతాల గురించి మాట్లాడడం ఆ రెండు పార్టీలకు అలవాటని విమర్శించారు. బీఆర్ఎస్ మాత్రం ప్రజల కులమతాలను కాదని, పేదరికాన్ని చూసి పథకాలను అమలుచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తారని, పేదల కోసం పని చేస్తారని స్పష్టం చేశారు. ‘సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అన్ని పండుగలను గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తున్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని ఒక్కో పేద విద్యార్థికి చదువుకు ఏటా రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. పేద పిల్లల చదువు కోసం వేల గురుకులాలను ప్రారంభించారు. ఈగట్టున రైతుబంధు ఉంటే ఆగట్టున రాబందులు ఉన్నయ్.. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి.’ అని కోరారు.
మీ అందరి మద్దతుతో కాబోయే శాసనసభ్యుడు నరేందర్..
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన సంక్షేమ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘మీ అందరి మద్దతు, ప్రేమతో తిరిగి మళ్లీ కాబోయే శాసనసభ్యుడు సోదరుడు నన్నపునేని నరేందర్‌కు అభినందనలు. మళ్లీ చెప్పాలా.. మీ అందరి మద్దతుతో తిరిగి కాబోయే శాసనసభ్యుడు మా తమ్ముడు నన్నపునేని నరేందర్’ అంటూ పేర్కొన్నారు. ఇక్కడ ఒకేరోజు 15,072 మందికి వివిధ సంక్షేమ పథకాలు అదించడం గొప్ప విషయమన్నారు. ఇంత గొప్పగా లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేందర్‌కు అభినందనలని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే సంక్షేమమని, ప్రతిపక్షాలు అంటే సంక్షోభమని అన్నారు.
దివ్యాంగులకు రూ.4,016 పెన్ష న్ ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని, నేడు వరంగల్తూ ర్పు నియోజకవర్గంలో 4,078 మంది దివ్యాంగులకు పెన్షన్ అందుతోందని చెప్పారు. దళితబంధు పథకాన్ని కూడా నేడు ఈ నియోజకవర్గంలో 1,100 మందికి అందిస్తున్నామని చెప్పా రు. దళితబంధు పథకం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నరేందర్ పట్టుబట్టి 2200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాడని చెప్పారు. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో క ల్యాణలక్ష్మి పథకం ద్వారా 737, షాదీముబారక్ ద్వారా 44 మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 3వేల మం దికి గృహలక్ష్మి పథకాన్ని, మూడు వేల మందికి జీవో 58, 59 ద్వారా పట్టాలు అందిస్తున్నామని వివరించారు. ‘గత పాలకులు రైతులకు ఆరు గంటల కరెంటు అన్నరు.. మూడు గంటలు కూ డా ఇవ్వలేదు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే నరేందర్ 18 సంఘాలకు నేడు స్థలం అందిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలో నరేందర్ ప్రజలకు ఎంతో సేవ చేశాడని గుర్తుచేశారు. కింది స్థాయి నుంచి వచ్చిన నరేందర్‌ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు వద్దిరా జు రవిచంద్ర, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ అధ్యక్షులు ఎం సుధీర్కుమా ర్, గండ్ర జ్యోతి, పీ సంపత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, రైతు రుణ వి మోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవారెడ్డి, లైబ్రరీ చైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కలెక్టర్లు సిక్తాపట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి స మ్మారావు, కుడామాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు మౌలానా, రమేశ్‌బాబు, బొల్లం సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
వినయన్నకు రికార్డు మెజారిటీ
తెలంగాణ ఉద్యమ ప్రతిదశలో ఉద్యమనేత కేసీఆర్ వెంట నడిచిన వినయభాస్కర్ మాస్ లీడర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వినయన్నను రికార్డు మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘అన్నా అంటే నేనున్నా’నంటూ ఉరికి వచ్చే నాయకుడు వినయన్న అని ప్రసంశించారు. ఏ సందర్భంలో ఎప్పుడు పిలిచినా వినయన్న వెంటనే వస్తాడని.. అందుకే కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రభుత్వ చీఫ్‌విప్‌గా హనుమకొండ ప్రజలు ఆశీర్వదించారని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారని, వాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కారుకు ఓటు వేసి వినయ్‌భాస్కర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటివరకు వినయ్‌భాస్కర్‌కు 67 వేల మెజార్టీ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో హనుమకొండలో ఆ రికార్డు బద్దలు కావాలన్నారు.
అన్ని రంగాల్లో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి
హనుమకొండ, అక్టోబర్ 6 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని కుడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేండ్లలో నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్, ఐటీ, కల్చరల్, హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, నగరంలో 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే కాళోజీ కళాక్షేత్రం ప్రారంభిస్తామన్నారు. ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందాయని, ఈ ఒక్క రోజే రూ.1,100 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఉద్యమ సమయం, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములయ్యారని, మంత్రి కేటీఆర్ రాకతో కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం పెరిగిందని చీఫ్ విప్ అన్నారు.
సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం
ఖిలావరంగల్, అక్టోబర్ 6 : నిరుపేద కుటుంబానికి చెందిన తనకు కార్పొరేటర్‌గా, మేయర్‌గా, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖిలావరంగల్‌లో తూర్పు సంక్షేమ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలబెట్టి సభా వేదిక సాక్షిగా 15 వేల మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఇక్కడ రూ.4100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు తూర్పును కానుకగా ఇవ్వాలన్నారు. స్లమ్ ఏరియాలను కూడా గొప్పగా అభివృద్ధి చేశామని, వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మించామన్నారు. రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు రామన్న ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు నెలకొల్పాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.