వరంగల్, అక్టోబర్ 6 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యాన ఓరుగల్లు మహానగరంలో శుక్రవారం అభివృద్ధి, సంక్షేమ ఉత్సవం కొనసాగింది. నగరంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు అమాత్యుడు రామన్న చేతులమీదుగా ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జాతరను తలపించాయి. మరోవైపు సభావేదికలపై వరంగల్ వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల పరిధిలో వేలాది మందికి వివిధ సంక్షేమ పథకాల ఫలాలను అందించగా లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రగతి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడంతో పాటు బహిరంగ సభ, సంక్షేమ సభలో పాల్గొన్నారు.
ఉదయం 10.40గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సెన్స్ కళాశాల మైదానంలో హెలీకాప్టర్ దిగిన మంత్రి కేటీఆర్, సాయంత్రం వరకు క్షణం తీరికలేకుండా నగరంలో పర్యటించారు. వరద ముంపు శాశ్వత నివారణ పనులకు శంకుస్థాపన చేశారు. పేదల డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు సభల్లో బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మంత్రి కేటీఆర్ పర్యటన అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. స్థానిక నాయకులను పలుకరిస్తూ ముందుకు వెళ్లిన కేటీఆర్, ప్రతి ఒక్కరినీ ఉత్సాహపరు స్తూ కార్యక్రమాలను కొనసాగించారు. సంక్షేమ ఫలాలు అందుకున్న లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడారు.
పశ్చిమ నియోజకవర్గంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ బీసీ, మైనార్టీ బంధు ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఖిలావరంగల్ గ్రౌండ్లో జరిగిన వరంగల్ తూర్పు నియోజకవర్గ సంక్షేమ సభలో 15వేల మందికిపైగా వివిధ పథకాల లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.