వరంగల్,(నమస్తేతెలంగాణ)/హనుమకొండ, మే 5: మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హనుమకొండ పార్టీ కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం ప్రారంభించారు. వరంగల్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమకొండ బాలసముంద్రంలో నిర్మించిన హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి రామన్నకు డప్పు చప్పుళ్లు, కోలాటాలతో మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్, అమరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌ను సీటులో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశ మందిరాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రికి వినతి పత్రాలు అందించారు.
ఖమ్మం రోడ్డులోని నాయుడు పెట్రోల్‌బంకు జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఆహ్వానించారు. కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, బస్వరాజు సారయ్య,తక్కళ్లపళ్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రాజయ్య, యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, మేయరు గుండు సుధారాణి, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత గొట్టిముక్కుల కేశవరావు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ కరుణాకర్, వరంగల్, మామునూరు ఏసీపీలు బోనాల కిషన్, కృపాకర్, మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బందోబస్తులో పాల్గొన్నారు.