వరంగల్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణలో పేల్చేటోళ్లు.. కూల్చేటోళ్లు తిరుగుతున్నరు.. కూల్చుడు, పేల్చుడు పనులకు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు పోటీపడుతున్నరు.. పచ్చని తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రసంగించారు.
‘ఒకడు ప్రగతి భవన్‌ను పేల్చేస్త అంటడు. ఇంకో పిచ్చోడు సెక్రటేరియట్‌ను కూల్చేస్త అంటడు. ఒకనికి ఒకడు పోటీ పడుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల పిచ్చిమాటలను ప్రజలు నమ్మొద్దు. నోటికి ఎంతస్తె ఆంత మాట్లాడుతరు.. ఆడబిడ్డలు ఆలోచించుకోవాలె.. ఒకాయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకోఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా? జైతెలంగాణ అని 2001లో కేసీఆర్ గులాబీ జెండా పట్టకొని బయలుదేరకుంటే వీళ్లను ఎవడన్న దేకునా? టీపీసీసీ, తెలంగాణ బీజేపీ ఉండునా? ఇద్దరు ఎట్లుండె గంజిల ఈగల్లెక్క ఒకరు కరీంనగర్ల కార్పొరేటరు, ఇంకొకడు రోడ్ల పొంటి తిరుగుతుండె. కేసీఆర్ ఉద్యమం, తెలంగాణ ప్రజల పోరాట ఫలితం పుణ్యమా అని రాష్ట్రం వస్తే ఒక దుకాణం పెట్టుకొని వాళ్లు మాట్లాడుతుంటె గమ్మతనిపిస్తది.
జయశంకర్ మహానుభావుడు..
తెలంగాణలో సాధించిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి స్వర్గంలో ఉన్న జయంకర్ సారు గుండె నిండా ఇప్పుడు సంతృప్తి ఉంటుంది. సింగరేణిలో కార్మికులకు గతంలో 14 శాతం బోనస్ వచ్చేది. ఇప్పుడు ఇక్కడ సీఎం కేసీఆర్ 35 శాతం ఇస్తున్నరు. దేశంలో కోల్ ఇండియా కూడా ఇంత ఇస్తలేదు. సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెబుతున్న. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని అమ్మినట్లే సింగరేణిని కూడా మోదీ అమ్మేస్తడని, అదానీకి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నరని కార్మిక సంఘాల నేతలు నన్ను కలిసినప్పుడుల్లా ఆందోళన చెందుతున్నరు. అలా జరిగేందుకు అవకాశం ఇచ్చేది లేదు. అవసరమైతే ఎవరితో అయినా, ఎక్కడిదాకా అయినా కొట్లాడుతం. సింగరేణిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానియ్యం. సీఎం కేసీఆర్ కార్మికులను కడుపులో పెట్టుకొని చూస్తున్నరు. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నరు. విద్యార్థుల, ఆడబిడ్డలను అన్నగా, మేనమామగా చూసుకుంటున్నరు. ఇలాంటి నాయకుడిని కాపాడుకుంటే రాష్ర్టానికి మంచిది..
ఎమ్మెల్యే గండ్రతో అనుబంధం..
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన. వెంకటరమణారెడ్డి అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ విషయంలో ధర్మం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తదని అప్పుడు కాంగ్రెస్‌లో ఉండి కూడా రమణారెడ్డి చెప్పిండు. ఆ తర్వాత రెండు నెలలకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహారదీక్షలోకి వెళ్లడం, రాష్ట్రం రావడం జరిగింది. గండ్ర వెంకటరమణారెడ్డి 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిండు. భారత రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌లోని రెండొంతుల మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమయ్యిండ్లు. ఇదే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో అధికారంలో ఉన్నది. అక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకున్నడు. అక్కడ కాంగ్రెస్ చేసిందే ఇక్కడా జరిగింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే సంసారం, ఇక్కడ మేం చేస్తే తప్పెలా అయ్యింది. ప్రజల మనసులను గెలవాలంటే వారి అవసరాలను తెలుసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చాలి. మధుసూదనాచారి సీనియర్ నాయకుడు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. గత ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీని చేసిండు. ఇంకో ఐదేండ్లు పదవీకాలం ఉన్నది. భూపాలపల్లి నియోజకవర్గం గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ముందుకుపోతది’ అని పేర్కొన్నారు.
ప్రజలే దేవుళ్లు
ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్నా.. సుదీర్ఘ కాలంగా జాతీయ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పని చేశా. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచా. మంత్రి కేటీఆర్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం, సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజలు, రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్లో చేరా. ఓటుకు నోటు కేసులో దొరికి, చిప్పకూడు తిన్న ఓ దుర్మార్గుడు నా గురించి అవాకులు చెవాకులు పేలుతున్నడు. నేను ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నా. నియోజకవర్గాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్లుగా భావించి పని చేస్తున్నా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చా. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్, ఆయన వెంట తిరుగుతున్న వారు బ్లాక్మెయిలర్స్. రేవంత్ భూపాలపల్లిలో నిలబడ్డా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఆయనను తుక్కు తుక్కుగా ఓడిస్తా.. సీఎం కేసీఆర్ సింగరేణి సీఎండీని ఆదేశించడం వల్ల ఈ రోజు భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల కోసం వెయ్యి క్వార్టర్లను నిర్మించుకున్నం. సుభాష్ కాలనీ, కృష్ణకాలనీ వాసులకు సీఎం కేసీఆర్ స్పెషల్ జీవో ఇవ్వడం వల్ల పట్టాలు ఇప్పించుకున్నం.
– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కేసీఆర్ నాయకత్వంలో భూపాలపల్లి గణనీయ అభివృద్ధి
జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : 30 ఏండ్ల నుంచి చూస్తున్నా, భూపాలపల్లి చాలా వెనుకబడి ఉండేది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. మెడికల్ కళాశాల, వంద పడకల దవాఖాన ఇలా అన్ని వసతులు కల్పించిన సీఎం కేసీఆర్‌పై కృతజ్ఞత చూపించాలి. కాళేశ్వరం, దేవాదుల నీళ్లు తెచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్. భూపాలపల్లి అభివృద్ధికి మరో రూ.25కోట్లు మంజూరు చేస్తున్నా. ఇతర జిల్లాల్లో మహిళా సంఘాల సభ్యులకు రూ.100కోట్ల రుణాలిస్తే, భూపాలపల్లిలో రూ.300కోట్ల రుణాలు ఇచ్చినం. గతాన్ని మీరొక్కసారి గుర్తు చేసుకోండి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎంత మారిందో బేరీజు వేసుకోండి. కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ 50వేల మందితో సభ నిర్వహించుకోవడం హర్షించదగ్గవిషయం. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూర్ఖులు. వారిని తరిమికొట్టాలె. రాష్ట్రంలో రెండు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయ్. అందులో ఒక పిచ్చికుక్క రేవంత్‌రెడ్డి అయితే, మరో పిచ్చికుక్క బండి సంజయ్.. ఆ పిచ్చి కుక్కలను తరిమికొట్టాలె. రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్. నా కింద పని చేసిండు. ఆయన బతుకేందో అందరికీ తెలుసు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కాంగ్రెస్, బీజేపీ ఏం అభివృద్ధి చేసినయ్?
ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి ఎనిమిదేండ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎగతాళి చేసిన వారందరికీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే చెంపపెట్టు. రాష్ట్రంలో కొత్త జిల్లాలతో పాలన ప్రజల ముంగిట్లోకి వచ్చింది. వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నయ్. ఇక్కడ కొందరు పాదయాత్ర చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం అభివృద్ధి చేశాయో చెప్పాలి. బీజేపీ వల్ల పేదోళ్లకు ఒక్క మేలైనా జరిగిందా? ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని కోరుతున్నయంటే బీజేపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
– మంత్రి సత్యవతి రాథోడ్
జిల్లాను ముందుకు తీసుకెళ్తా
భూపాలపల్లి టౌన్ : పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేయాలని చెప్పినా విజయవంతంగా పూర్తి చేస్తా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ డైరెక్షన్లో జిల్లాను ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తా. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగిరేలా కృషి చేస్తా. జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ గుర్తింపు పొందింది. మంత్రి కేటీఆర్ కృషితోనే భూపాలపల్లికి మెడికల్ కళాశాల వచ్చింది. అభివృద్ధిలో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.
-బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి