భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 23 : ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కార్యకర్తలు, నాయకులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన, అన్ని హంగులతో భవనం నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశ మందిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయన్నారు.
అందుకే ఇక్కడి పథకాలను దేశవ్యాప్తం చేసి, అన్ని రాష్ర్టాలను తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. పార్టీ పేరు మారిందే గానీ జెండా ఎజెండా, కమిట్మెంట్ మారలేదన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నయి.. చిల్లర మాటలు మాట్లాడేవారు వస్తుంటరు.. వారు ఇటుక పెల్లతో కొట్టినట్లు మాట్లాడితే మనం రాయితో కొట్టినట్లు మాట్లాడాలె.. ప్రతి మాటకు తూటా లాంటి కౌంటర్ ఇవ్వాలె..’ అని పిలుపునిచ్చారు. పార్టీ ఆఫీస్ నాయకులు, కార్యకర్తలతో రోజూ కళకళలాడాలన్నారు. జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిని కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.