గిర్మాజీపేట, డిసెంబర్ 23: వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఆమె బట్టలబజార్‌లోని శ్రీబాలానగర్ వేంకటేశ్వరాలయాన్ని మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో ఎలపాటి రత్నాకర్‌రెడ్డి, అర్చకులు మంత్రికి పూర్ణకుంభం స్వాగతం పలికారు.
అనంతరం ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మంత్రిని అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాల పునర్మిణాన్ని కొనసాగిస్తామన్నారు.
పోచమ్మమైదాన్: అర్చకులు, ఫాదర్లు, ఇమామ్‌లకు త్వరలో గౌరవ వేతనాలు పెంచుతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి, క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన తొలి ప్రాధాన్యం తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఇస్తానన్నారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, పద్మ, పల్లం పద్మ, రవి, గుండు చందన, నోడల్ అధికారి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.