వరంగల్, ఫిబ్రవరి : మహా నగర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా అన్నారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మంత్రి గ్రేటర్, కుడా, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ద్వారా నగర సమగ్ర అభివృద్ధి, ముంపు నివారణకు పలు పథకాల కింద చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి రూ.10కోట్ల చొప్పున నిధులను కేటాయించిందని, ఎమ్మెల్యేలు సమన్వయంతో అవసరమైన పనులు చేపట్టేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు.
బల్దియా ద్వారా సాధారణ నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, స్మార్ట్ సిటీ, 15వ ఫైనాన్స్ తదితర పథకాల కింద నియోజకవర్గాల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి సమగ్రంగా సమీక్షించారు. స్మార్ట్ సిటీ కింద చేపట్టిన భద్రకాళి బండ్, బండ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. గ్రేటర్ పరిధిలో నిర్మించే నాలుగు స్టేడియాలు, రంగసముద్రం బండ్ సుందరీకరణ అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ పనుల్లో వేగం పెంచాలని, భూసేకరణ త్వరగా చేపట్టి పనులను పూర్తి చేయాలని కుడా అధికారులను ఆదేశించారు.
రూ.75కోట్ల వ్యయంతో చేస్తున్న వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులకు టెండర్ పూర్తయినందున పనులు ప్రారంభించాలన్నారు. భద్రకాళి ఆలయం చుట్టూ వీధుల నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రం పనులు చివరి దశకు చేరుకున్నందున త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రేటర్లో నీటిఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముంపు నివారణ పనుల కోసం మంజూరైన రూ.250కోట్లతో వాల్, విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. నగరంలోని 36కిలోమీటర్ల మేర ఉన్న నాలాలపై బల్దియా, ఇరిగేషన్ అధికారులు డీజీపీఎస్ సర్వే చేయించాలని ఆదేశించారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వర్షాకాలంలో నగరం ముంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. విలీన గ్రామాల్లో పారిశుధ్య సిబ్బందిని పెంచాలన్నారు. భగీరథ ద్వారా తాగునీరు అందడం లేదన్నారు. పశ్చిమ శాసనసభ్యులు నాయిని మాట్లాడుతూ వరద నివారణ చర్యల్లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాఖడే, బల్దియా ఎస్ఈలు కృష్ణారావు, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, సిటీప్లానర్ వెంకన్న, హనుమకొండ, వరంగల్ ఆర్డీవోలు రమేశ్, వాసుచంద్ర, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా: హనుమకొండ నుంచి బెంగళూరుకు నడిచే నాలుగు ఏసీ స్లీపర్ (లహరి) బస్సులను శనివారం హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలతతో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీలో 70మందికి కారుణ్య నియామక పత్రాలు అందించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం మాధవరావు, భానుకిరణ్ పాల్గొన్నారు.