ఖిలావరంగల్, ఫిబ్రవరి 8: నగరంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ నెల 10న వస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు, డీఈ రాజశేఖర్‌తో కలిసి సమీక్షించారు. మంత్రి హరీశ్‌రావు పర్యటనలో మంత్రులు సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఎర్రబెల్లి అన్నారు. ఎంజీఎం దవాఖానలో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన 42 పడకల పిల్లల కొవిడ్ సంరక్షణ విభాగాన్ని మంత్రులు ప్రారంభిస్తారన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రంలో రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసిన సమగ్ర చనుపాల నిర్వహణ కేంద్రం, రూ. 38 లక్షలతో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. రూ. 1.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న డయాగ్నోస్టిక్స్ కేంద్రం భవనానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అందరూ సిద్ధం కావాలని సూచించారు.