న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.600 పెరిగి రూ.1,61,300కి చేరుకున్నది. బంగారంతోపాటు వెండి ఎగబాకింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.4 వేలు అధికమై రూ.2.68 లక్షలకు చేరుకున్నది.
వచ్చే సమీక్షల్లో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నట్టు వచ్చిన సంకేతాలతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండికి మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4.71 డాలర్లు లేదా 6 శాతం పెరిగి 85.51 డాలర్లకు చేరుకోగా, బంగారం 10.6 శాతం అందుకొని 5,078.72 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.