న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 : వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) సంబంధిత బ్యాంక్ మోసాలు ఇటీవలికాలంలో గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రముఖ టెలికాం సేవల సంస్థ ఎయిర్టెల్.. బుధవారం తమ వినియోగదారుల రక్షణార్థం ఓ ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత ఫ్రాడ్ అలర్ట్ సొల్యూషన్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రతి దానికీ ఓటీపీలు వస్తుండటంతో వాటిని అడ్డం పెట్టుకొనే అమాయకులను ఘరానా మోసగాళ్లు ముంచేస్తున్నారని ఎయిర్టెల్ ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఏఐ ఆధారిత వ్యవస్థను తెచ్చామని, ఇది కస్టమర్లు నష్టపోయే ముప్పు ఉన్నప్పుడు గుర్తించి అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నది.
ఇందులోభాగంగానే ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాంక్ ఓటీపీ వస్తే.. ఏదో మోసానికి వీలుందని, ఓటీపీని ఎవ్వరికీ చెప్పరాదని, ఆర్థికంగా నష్టపోతారంటూ మొబైల్ ఫోన్ వినియోగదారులను ఎయిర్టెల్ హెచ్చరించనున్నది. దీనివల్ల కస్టమర్లు ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునే వీలుంటుందని, మోసాలబారిన పడకుండా ఉంటారన్నది. ఇప్పటికే స్పామ్ కాల్ హెచ్చరికలు, మోసపూరిత ఆన్లైన్ లింకుల విషయంలో మొబైల్ యూజర్లను అప్రమత్తం చేస్తున్నామని ఎయిర్టెల్ ఇండియా ఎండీ, సీఈవో శశ్వత్ శర్మ గుర్తుచేశారు. ఇప్పుడు ఓటీపీల ద్వారా వాటిల్లుతున్న నష్టాలకూ అడ్డుకట్ట వేసే దిశగా వెళ్తున్నామని చెప్పారు.