మెదక్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ) : మెదక్ జిల్లాలో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనల మధ్య ముగిసింది. అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారు. మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవరించారనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
మెదక్ పట్టణంలోని 26,30 వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగారు. మెదక్ పట్టణంలో 26 వార్డులో మైనర్ ఓటు వేసేందుకు రావడంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం నుంచి పంపించారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో కొన్నిచోట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి.
రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై బీఆర్ఎస్ను ఓడించేందుకు కుట్రలు చేశారు. బీఆర్ఎస్ నాయకులను, ఓటర్లును బెదిరింపులకు గురిచేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేసేందుకు బురక వేసుకుని ఇద్దరు రావడంతో అక్కడే ఉన్న ఏజెంట్లు అడ్డుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఇరుపార్టీల శ్రేణులను నిలువరించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
పోలింగ్ ప్రారంభం నుంచి సాయంత్రం ముగిసే వరకు నర్సాపూర్‌లో పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యాలు చేసేందుకు ప్రయత్నించారు. అధికార కాంగ్రెస్ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి మెదక్‌లోని 18 వార్డు గాంధీనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో ఉండి కలెక్టర్ దంపతులు ఓటు వేశారు.
మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బుధవారం చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 9 గంటలకు నర్సాపూర్‌లో 13.37 శాతం పోలింగ్ నమోదైంది. రామాయంపేటలో 14.65 శాతం, మెదక్‌లో 13.40 శాతం,తూప్రాన్‌లో 13.65 శాతం నమోదైంది. 9గంటలకు జిల్లావ్యాప్తంగా 13.64 శాతం నమోదైంది. ఉదయం 11 గంటలకు మెదక్‌లో 35.64 శాతం, రామాయంపేటలో 38.27 శాతం, తూప్రాన్‌లో 35. 94 శాతం, నర్సాపూర్‌లో 34.09 శాతం నమోదైంది. జిల్లా వ్యాప్తింగా 35.94 శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంటలకు మెదక్‌లో 57.84 శాతం, రామాయంపేటలో 60.79 శాతం, తూప్రాన్ 57.7 శాతం, నర్సాపూర్‌లో 55.93 శాతం నమోదు కాగా, జిల్లావ్యాప్తంగా 57.88 శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్‌లో 71.31 శాతం, రామాయంపేటలో 76. 11 శాతం, తూప్రాన్‌లో 71.50 శాతం, నర్సాపూర్‌లో 69. 10 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లావ్యాప్తంగా 71.65 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు మెదక్‌లో 80.76 శాతం, నర్సాపూర్‌లో 73.61 శాతం, రామాయంపేటలో 84.84 శాతం, తూప్రాన్‌లో 81.30 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 81.09 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
