వరంగల్: పవిత్ర మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని వేయి స్తంభాల గుడిలోని రుద్రేశ్వర స్వామికి, పర్వతగిరిలోని పర్వతాల శివాలయానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
శనివారం వేయి స్తంభాల గుడిని దర్శించుకున్న ఎర్రబెల్లి రుద్రేశ్వరుడికి పాలాభిషేకం చేశారు. అనంతరం పర్వతగిరిలోని పర్వతాల శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పరమ శివుడు రాష్ట్ర ప్రజలను సంతోషంగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రిని ఘనంగా సన్మానించారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్ధశ వచ్చిందని అన్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టులను గత పాలకులు పట్టించుకోక సరైన అభివృద్ధి జరగలేదని.. తెలంగాణ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు కేసీఆర్ పూర్వ వైభవాన్ని తీసుకోస్తున్నారని పేర్కొన్నారు. వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.