వేలేరు, ఫిబ్రవరి 25 : ఈ నెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని, సూమారు రూ.150కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎత్తయిన ప్రాంతాలకు సాగునీరందించే మూడు ఎత్తిపోతల ప్రాజెక్టులు, డబుల్‌రోడ్డు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఉంటాయని, ఈ సందర్భంగా నిర్వహించే కృతజ్ఞత సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వేలేరు మండలం షోడాషపల్లిలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు చెప్పే అసత్యపు మాటలకు ప్రజల్లో విలువ లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు ఈ స్థాయి అభివృద్ధిని ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరందించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ నెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ సూమారు రూ.150కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎత్తయిన ప్రాంతాలకు సాగునీరు అందించే మూడు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లు, డబుల్‌రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు.
ఈ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఈ ప్రాంత రైతులు భారీగా తరలివచ్చి కృతజ్ఞతలు తెలుపాలని పిలుపునిచ్చారు. సూమారు 30వేల మందితో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తాత మధు, బస్వరాజు సారయ్య, ఆర్అండ్బీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహారావు, సర్పంచ్ కొట్టె రాజేశ్, డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.