రాయపర్తి, ఏప్రిల్ 12 : ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. రాయపర్తి గ్రామ శివారు మహబూబ్‌నగర్ గ్రామ ప్రధాన రహదారిలోని కుందూరు దొరవారి మామిడితోటలో రాయపర్తి-1, రాయపర్తి-2 ఎంపీటీసీ స్థానాల పరిధి గ్రామాలు, శివారు తండాలు, ఆవాస ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ శ్రేణులతో కలిసి ఫొటోలు దిగుతూ, ఆటలు ఆడుతూ కుశల ప్రశ్నలు వేస్తూ సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో దేశాన్ని ఏలిన కాంగ్రెస్, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంతో ప్రజలు ఆ రెండు పార్టీలను విశ్వసించడం లేదన్నారు. అలుపెరుగని పోరాటాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్తోనే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందనే విశ్వాసం ప్రజల్లో కలుగుతున్నట్లు ఆయన వివరించారు. జాతీయ సంపద, ఆర్థిక వనరులన్నింటినీ కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ప్రైవేట్ కంపెనీలకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ సర్కారుకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ఏలుబడిలోనే తెలంగాణ రాష్ట్రం సకల సిరులకు నిలయంగా మారుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌పై దేశ విదేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుటిల ప్రయత్నాలను చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ కృషితోనే అన్నపూర్ణగా తెలంగాణ..
సీఎ కేసీఆర్ కృషితోనే నేడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం అవతరించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, పంటలకు మద్దతు ధర, సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని ఆయన వివరించారు. మిషన్ భగీరథ, తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి, రైతువేదికలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రహదారుల నిర్మాణాలతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నట్లు ఆయన వివరించారు.
పనికర మల్లయ్యకు ఘన సన్మానం..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వేదికపై మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పనికర మల్లయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు-ఉష దంపతులు, పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఆనాడు పనికర మల్లయ్య చూపించిన తెగువ కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని మంత్రి ఎర్రబెల్లి గుర్తుచేశారు.
బలగం బాబుకు ఆత్మీయ స్వాగతం..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మండల కేంద్రానికి చెందిన నటుడు, బలగం సినిమాలో అంజయ్య పాత్రధారి గుడిబోయిన బాబు (బలగం బాబు)ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభా వేదికపైకి ఆత్మీయంగా స్వాగతించారు. బలగం సినిమాలో అద్భుతమైన నటనతో బాబు రాయపర్తి మండల ఖ్యాతిని ఇనుమడింపజేశాడని కొనియాడారు. అనంతరం గీత కార్మికుడు చేగొం డ ప్రసాద్ అనే తెచ్చిన తాటి కల్లు రుచిని మంత్రి ఎర్రబెల్లి చూసి గౌడన్నకు శభాష్ అంటూ కితాబిచ్చారు. సమ్మేళనంలో పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, మండల ఇన్చార్జి అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ధరావత్ స్వభిమాన్ మోహన్ గాంధీనాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గారె నర్సయ్య, బిల్ల రాధిక, సుభాష్‌రెడ్డి, అయిత రాంచందర్, నేతావత్ కిషన్‌నాయక్, నాయకులు ఎండీ నయీం, ఉస్మాన్, బందెల బాలరాజు, వనజారాణి, అక్బర్, రామారావు, సత్యం, సింహాద్రి పాల్గొన్నారు.
రాయపర్తి ప్రజల రుణం తీర్చుకోలేను..
రాయపర్తి మండలాన్ని అభివృద్ధి పథంలో అగ్రపథాన నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కిష్టాపురం క్రాస్ రోడ్డులోని వీఆర్ గార్డెన్స్‌లో మైలారం, మొరిపిరాల గ్రామాల ఎంపీటీసీ స్థానాల పరిధి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న రాయపర్తి మండల ప్రజల రుణం ఏనాటికి తీర్చుకోలేనని ఎర్రబెల్లి చెప్పారు. భావోద్వేగానికి గురైన మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి చుక్కానిగా నిలుస్తున్న రాయపర్తి మండల ప్రజలకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదని అన్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని, ప్రస్తుత ఏడాదిలో అన్ని గ్రామాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ యిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వయంగా భోజనాలు వడ్డించారు. సమ్మేళనంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల నాయకులు పూస మధు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేతాకుల సుమతీయాదవరెడ్డి, చెడుపాక కుమారస్వామి, అండ్రెడ్డి యాదమ్మ, సంకినేని ఉప్పలమ్మ, కునుసోతు సజ్జన్, భూక్యా వెంకట్రాంనాయక్, ఎంపీటీసీలు గాడిపల్లి వెంకన్న, భూక్యా క్రాంతి, పారుపల్లి సుధాకర్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, గబ్బెట బాబు, కుందూరు యాదగిరిరెడ్డి, రాంచంద్రారెడ్డి, వేముల రమేశ్, ఉండాడి సతీశ్, చిట్యాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు స్థానం లేదు..
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడు కొన్ని గంజాయి మొక్కల వంటి ప్రతిపక్ష పార్టీలు తులసి వనాన్ని కలుషితం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు స్థానం కల్పించారు. అనే విశ్వాసం కలుగుతున్నది.
– మహ్మద్ సఫియా, గృహిణి రాయపర్తి
గ్రామాల రూపు రేఖలు మారాయి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధికి అమడ దూరంలో ఉండేవి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్ణణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆనాడు శిథిల భవనాలకు నిలయాలుగా ఉన్న గ్రామాలన్నీ నేడు పట్టణాలతో పోటీ పడేందుకు సన్నద్ధమవుతున్నాయి.
– జేరిపోతుల రోహిణి, రాయపర్తి
సారు పరిపాలన పండుగలా ఉంది..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో పండుగలా సాగుతాంది. ఇప్పుడు ఎక్కడ జూసిన పంటలు పుష్కలంగా పండుతానయి. కాల్వలు, చెర్వులు, కుంటళ్ల నీళ్లు ఎండ కాలంల కూడా మత్తడి దుంకబట్టె. దేశంల గూడ గిసొంటి పరిస్థితులు రావాలంటే కేసీఆర్ సారు ఢిల్లీకి బోతనే బాగుంటది. 10 ఏండ్ల కిందట ఆంధ్రోళ్లు పాలన జేసినప్పడు మాకు తింటానికి తిండి లేదు, గ్రామాల్లో ఎండాకాలం నీళ్ల సుక్కలు దొరకకపాయే. కానీ, గిప్పుడు మస్తు సౌలత్లు అయితున్నయి.
– పనికర మల్లయ్య, తెలంగాణ ఉద్యమకారుడు