స్వరాష్ట్రంలోనే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో రూ.4.16కోట్లతో నిర్మించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమీకృత కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఊరి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణకే తలమానికమైన.. కోటి మందికిపైగా తరలివచ్చే మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించకుండా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు.
– వరంగల్, సెప్టెంబర్ 21
వరంగల్, సెప్టెంబర్ 21 : తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని, అందరి పండుగలూ సంబురంగా జరుగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో రూ.4.16కోట్లతో నిర్మించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమీకృత కార్యాలయాన్ని ( ధార్మిక భవన్) ఆయన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే నరేందర్, మేయర్ సుధారాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోనే కవులు, కళాకారులకు గౌరవం దక్కుతోందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. ధూప, దీప నైవేద్య పథకం కింద గత పాలకులు రూ.2500 ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రూ.10వేలకు పెంచిందన్నారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో 1840 దేవస్థానాలకు వర్తింపజేస్తున్నామని చెప్పారు. మున్ముందు మరో 2,896 ఆలయాలకు వర్తింపజేస్తామన్నారు. ధూపదీప నైవేద్యాలతో గుడులు నేడు కళకళలాడుతున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఊరిలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాదిలో నిర్వహించే కుంభమేళాకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కోటి మందికిపైగా భక్తులు తరలివచ్చే మేడారం జాతరకు ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మేడారం జాతరను మరో కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. భద్రకాళీ, వేయి స్తంభాల దేవాలయం, వేములవాడ, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లి, నాంచారిమడూరు అలయాలతో పాటు కాకతీయుల కాలం నాటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కానుకలిచ్చి ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు.
ధార్మిక భవన్‌ను ప్రారంభించకోవడం సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండడం వల్ల పరిపాలన సౌలభ్యం కలుగుతుందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణలోనే ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని, సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు అని అన్నారు. దేవాదాయ శాఖ రీజినల్ కార్యాలయాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ చారిత్రక భద్రకాళీ ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించిందని, త్వరగా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కోరారు. నాలుగు అంతస్తుల ధార్మిక భవనంలో వేదపాఠశాల విద్యార్థులకు వసతి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు,అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, భద్రకాళీ అలయ ఈవో శేషుభారతి పాల్గొన్నారు.
మంత్రి ఆల్లోల, చీఫ్‌విప్ దాస్యం, బోయినపల్లి వినోద్‌కుమార్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి వచ్చినవారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహామండపంలో ప్రధాన అర్చకుడు భద్రకాళీ శేషు మహాశీర్వచనం ఇచ్చి అమ్మవారి శేషవస్ర్తాలను, ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
నయీంనగర్ : వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరుడిని మంత్రి అల్లోల, చీఫ్‌విప్ దాస్యం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అంతకుముందు వీరికి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభ స్వాగతం పలికారు.