నర్సింహులపేట, నవంబర్ 18 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు నుండి ఇసుక రవాణా చేస్తున్న ర్యాంపులను మైనింగ్, రెవిన్యూ అధికారులు మంగళవారం పరిశీలించారు. అక్రమ ఇసుక రవాణపై జిల్లా కలెక్టర్ అద్యైత కుమార్ సింగ్ ఆదేశాల మేరకు మంగళవారం అసిస్టెంట్ జియోలజిస్టు శ్రీనివాస్, అసిస్టెంట్ గ్రౌండ్ వాటర్ అధికారి వంశీ, తహశీల్దార్ రమేశ్ బాబు, ఇరిగేషన్ ఏఈ ర్యాంపులను పరిశీలించారు. వాగులో ఇసుక రవాణకు చేసేందుకు అవకాశం లేదని,ఇసుక రవాణా చేస్తే భూగర్భ జలాలు, నీటి లభ్యత లభించే అవకాశాలు లేవని ఈ విషయం జిల్లా కలెక్టరు వివరిస్తామన్నారు.
వాగు పరిశీలనకు వచ్చిన మైనింగ్ అధికారులను రైతులు నిలదీశారు. ఆకేరు వాగు నుండి వందలాది ట్రాక్టర్లు విచ్చల విడిగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా చేస్తుంటే ఎక్కడ ఉన్నరని ఆకేరువాగు పరిశీలినకు వచ్చిన అధికారులను నిలదీశారు. అధికారులు వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా దారులను జేసీబీతో కందకాలు తీశారని, ఆ కందాల పక్క నుండి దారులు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న మంగళవారం రెవెన్యూ సిబ్బంది వాగువద్ద కాపల ఉన్నప్పటికి అక్రమ రవాణా చేయడంపై ప్రజలు, రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.