శాయంపేట, అక్టోబర్ 12 : ధాన్యం సేకరణ నేపథ్యంలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో జరిగిన రూ.1.86 కోట్ల భారీ ఆర్థిక మోసం ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు గుర్తించకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇంత ఈజీగా కోట్లు కొల్లగొట్టవచ్చా? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. ఈ స్కాంను అధికారులు గుర్తించకుంటే బోనస్ పేరిట మరో రూ. 45 లక్షలు అక్రమార్కుల ఖాతాల్లో జమయ్యేవని తెలిసింది. నకిలీ కాగితాలు సృష్టించి ఇంత పెద్ద మోసానికి పాల్పడడం అధికారులతో పాటు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన రైస్ మిల్లర్ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల పేరిటే కోట్లు కొల్లగొట్టడం ముక్కున వేలేసుకునేలా చేసింది. అయితే ఇక్కడ అక్రమాలకు పాల్పడే వారికంటే తప్పు చేసేలా ఉన్న పద్ధతులపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలంటే సంబంధిత ఏఈవోలు ముందుగా సర్వే నంబరు,్ల ఉత్పత్తి ఎంత అనే వివరాలతో టోకె న్లు జారీ చేస్తారు. ఆ తర్వాత ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ట్రక్ షీట్లు రాస్తారు. అనంతరం ఏ రైతు పేరిట ఎన్ని బస్తాలు, ఎన్ని క్వింటాళ్లు అనే పూర్తి వివరాలు ట్రక్ షీట్లలో పొందుపరుస్తారు. ఇకడి నుంచి కేటాయించిన మిల్లుకు లారీల్లో రవాణా చేస్తారు. అకడ మిల్లర్ వీటిని పూర్తిస్థాయిలో చెక్ చేసి దిగుమతి చేసుకొని ఆన్లైన్ ఎంట్రీ చేసిన అనంతరం వాటిని తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపిస్తారు.
ఇక్కడ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) పోర్టల్‌లో అమ్మిన ధాన్యం, దాని విలువ, రైతు ఖాతాను నమోదు చేసి సివిల్ సైప్లెకి పంపిస్తే అధికారులు వివరాలు తనిఖీ చేసి డబ్బులు చెల్లిస్తారు. అయితే ఓపీఎంఎస్ పోర్టల్ నిర్వహణ అంతా ఏఈవోల నుంచి ఏవోల చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ పోర్టల్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతోనే భారీ మోసానికి తెరలేచినట్లుగా ఒకవైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు ఉద్యోగుల సహకారంతోనే చోటుచేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన స్కాంతో ఓపీఎంఎస్ పోర్టల్‌లో మార్పులకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఓటీపీ అమలు చేసి అక్రమాలకు చెక్ పేట్టేలా చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రైస్ మిల్లర్ శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల పేరిట రూ. 1.86 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. జమ్మికుంట, కమలాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన 12 మంది పేరిట 278 ఎకరాల భూమిని సృష్టించి, వారి పేర్లపై ట్రక్ షీట్లు రాసి, వాటిని ఏవేవో సర్వే నంబర్లతో పోర్టల్‌లో నమోదు చేసి 8,049.6 క్వింటాళ్ల ధాన్యం అమ్మినట్లు రికార్డు చేయడంతో రూ. 1,86,63,088 వారి ఖాతాల్లో జమయ్యాయి. వడ్లూరి నవత పేరిట 34 ఎకరాలు రాసి, 968.80 క్వింటాళ్లు అమ్మినట్లుగా నమోదు చేయడంతో రూ. 22,44,616 చెల్లింపులు జరిగాయి. అలాగే వడ్లూరి కల్యాణ్ 15 ఎకరాలు, 443.60 క్వింటాళ్లు, రూ.10,26,160, వడ్లూరి సాయిచరణ్ 33 ఎకరాలు, 938.40 క్వింటాళ్లు, రూ. 21,74,088, బెజ్జంకి శోభారాణి 33 ఎకరాలు, 332.40 క్వింటాళ్లు, రూ.7,71,168,
బెజ్జంకి శివకుమార్ 33 ఎకరాలు, 916 క్వింటాళ్లు, రూ. 21,25,120, బెజ్జంకి చందు 22 ఎకరాలు, 635 క్వింటాళ్లు, రూ. 14,73,664, వడ్లూరి రాజేందర్ 17 ఎకరాలు, 496.80 క్వింటాళ్లు, రూ.11,52,576, బెజ్జంకి పూనమ్చారి 26 ఎకరాలు, 862.88 క్వింటాళ్లు, రూ. 18,62,496, వేమునూరి శ్రీనవ్య 34 ఎకరాలు, 978 క్వింటాళ్లు, రూ. 22,65,968, వేమునూరి శ్రీనివాసాచారి 11 ఎకరాలు, 326 క్వింటాళ్లు, రూ. 7,57,428, వేమునూరి ఉదయలక్ష్మి 16 ఎకరాలు, 416 క్వింటాళ్లు, రూ. 10,67,200, చిర్న నేహసింధు పేరిట 26 ఎకరాల్లో 751 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా రూ. 17,42,784 చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ అవినీతి డబ్బు ఎవరెవరి చేతులు మారింది? సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
శాయంపేట పోలీసులు స్కాంపై విచారణను ముమ్మరం చేశారు. 21 మంది కేసు నమోదు చేయగా ఆదివా రం ఉద్యోగులను పిలిచి విచారించినట్లు తెలిసింది. నకిలీ రైతులు, మిల్లర్, మరికొందరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పత్తిపాకకు చెందిన బండ లలిత మధ్యవర్తిగా వ్యవహరించి ఓపీఎంఎస్లో నకిలీ ఎంట్రీలను న మోదు చేయించడంపై ఆరా తీస్తున్నారు. ప్రైవేటు ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోత్ చరణ్‌తో పాటు శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ ఇన్చార్జిలు హైమావతి, అనిత, ఏవో గంగాజమున, ఏఈవోలు అర్చన, సుప్రియల పాత్రపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.