రాయపర్తి/వరంగల్ చౌరస్తా, జూలై 11 : ఎంజీఎంలో శవం మారింది. మార్చురీ నుం చి ఒకరి బదులు మరొకరి మృతదేహం ఆ ఊరికి చేరడం.. తమది కాదని బంధువులు గుర్తించడం తో తిరిగి మళ్లీ మార్చురీకే వచ్చింది. దీంతో అప్పటిదాకా శ్మశానవాటిక వద్ద అన్ని లాంఛనాలన్నీ సిద్ధంచేసుకొని శవం కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు.. తీరా అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహం తమది కాదని తెలిసి ఖంగుతినాల్సి వచ్చింది. మరి ఈ శవం వారిది కాకపోతే అసలు డెడ్‌బాడీ ఏమైనట్టు? పార్థివదేహాల అప్పగింతలో నిర్లక్ష్యం ఎవరిది? అనేది తేలాల్సి ఉంది.
ఎంజీఎం మార్చురీలో మృతదేహం మారిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ తిరిగి శవాన్ని అప్పగించిన ఘటన రాయపర్తి మండలంలోని మైలారంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టెకు చెందిన గోక కుమారస్వామి(55)తో 35 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉపాధి కోసం కొంతకాలంపాటు వీరు సూరత్‌కు వలస వెళ్లగా కుమారస్వామి మద్యానికి బానిసయ్యాడు.
దీంతో 24 ఏండ్ల క్రితం భార్యాభర్తలు ఎవరి గ్రామంలో వారే ఒంటరిగా ఉంటున్నారు. కుమారస్వామి తొర్రూరుకు వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. ఈ నెల 9న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో గాయాలతో స్పృహ కోల్పోయి ఉండడంతో అక్కడి పోలీసులు ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించి కుమారస్వామి గురువారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో మృతుడి భార్య రమ, కుమార్తె ఎంజీఎంకు వెళ్లి మృతదేహాన్ని చూసి నిర్ధారించారు. పోలీసులు పంచనామా చేసి మార్చురీ అధికారులకు అప్పగించారు.
శుక్రవారం పోలీసులు మార్చురీ నుంచి మృతుడి భార్య, కు మార్తెకు మృతదేహాన్ని అప్పగించగా దహన సంస్కారాల నిమిత్తం మైలారంలోని కుంట వద్దకు అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. శవా న్ని కిందికు దింపి చూడగా కుమారస్వామి మృతదేహానికి బదులు వేరొక శవం ఉందని చెప్పడంతో తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ విషయమై వైద్యాధికారులను అడుగగా పంచనామా తర్వాత శవాన్ని పోలీసుల నుంచి స్వాధీనం చేసుకొని శవ పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి అప్పగించడం వరకు మాత్రమే తమ బాధ్యత అని.. కుటుంబసభ్యులకు చూపించి, మృతదేహాన్ని అప్పగించే బాధ్యత పోలీసులదేనని చెప్పారు.