వరంగల్‌చౌరస్తా, నవంబర్ 9 : స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలన్నా ఇక్కడి వైద్యాధికారులకు లెక్కలేదు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్యసేవలు మెరుగుపడేలా, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారికి తావులేకుండా చూడాల్సిన వైద్యాధికారులు మంత్రి ఆదేశాలను సైతం పక్కనపెట్టేశారు. ఇటీవల ఎంజీఎం దవాఖానలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు వేరే గ్రూపు రక్తం ఎక్కించడం, ఇద్దరు చిన్నారులకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం, పోస్టుమార్టంకు నగదు వసూళ్లు, అడ్డదారుల్లో ఉద్యోగుల నియామకాలకు ప్రయత్నించడం, కలెక్టర్‌కు సైతం తప్పుడు సమాచారం అందించడం, సేవల్లో నిర్లక్ష్యం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే విభాగాలు అక్రమాలకు పాల్పడడం వంటి సమస్యలపై వైద్యాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో సూపరింటెండెంట్‌ను మార్చాలని, ఏళ్ల తరబడి ఎంజీఎంహెచ్లోనే పనిచేస్తున్న వారి విభాగాలను మార్చాలని అక్టోబర్ 25న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు.
దీంతో వైద్య,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూపరింటెండెంట్‌ను మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విభాగాల విషయంలో మాత్రం మంత్రి ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. ఏళ్ల తరబడి ఎంజీఎంహెచ్ కార్యాలయ విధులు నిర్వర్తిస్తున్న కొందరు పదోన్నతులను సైతం వదులుకొని ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. వారిపై నిర్లక్ష్యం వహించడంతోపాటుగా పలు ఆరోపణలు ఉన్నాయి. తమ విధుల మార్పుపై అధికారులు దృష్టి నిలపకుండా ఉండడానికి వారికి అండగా ఉండే రాజకీయ, యూనియన్, ఉద్యోగ సంఘాల నేతలను రంగంలోకి దించుతున్నారు.
మంత్రి ఆదేశాలకు అనుగుణంగా విధుల్లో మార్పులు జరగాల్సిన ఉద్యోగుల్లో చాలా వరకు యూనియన్, ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ఉన్నట్లు తెలియవచ్చింది. యూనియన్లు, ఉద్యోగ సంఘాల పేరుతో ఎంజీఎంహెచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు తమ విధులపై శ్రద్ధ కనబరచకపోవడంతో రోగులు, ఉద్యోగులకు సైతం ఇబ్బంది కలుగుతున్నట్లు తోటివారే అంగీకరిస్తున్నారు. అటు విధులకు ఇటు యూనియన్లకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, అందుకు బదులుగా యూనియన్, సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగులను తక్కువ పని ఒత్తిడి కలిగిన విభాగాలకు మార్చడం మూలంగా సమస్యకు పరిష్కారం లభించడమే కాక మంత్రి కోరుకున్నట్లుగా సేవలు మెరుగుపడే అవకాశముంది. అలాగే రోగులకు సరైన సమయంలో వైద్యం అందించేందుకు వీలు కలుగుతుంది.