హనుమకొండ చౌరస్తా, జూలై 29 : పేద గర్భిణులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్)లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రైవేట్‌లో వైద్యం ఆర్థిక భారంగా మారడంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌కు చెందిన అనేక మంది గర్భిణులు ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తుంటారు. అయితే ఇక్కడ పనిచేసే డాక్టర్లలో ఎవరు ఎప్పుడు వస్తరో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దవాఖానలో 60 మందికిపైగా వైద్యులుండగా, సీనియర్లు హాజరు వేసుకొని సొంత క్లినిక్‌లకు వెళ్తుండగా, జూనియర్లే వైద్య సేవలందిస్తున్నారు.
దీనికితోడు ఇక్కడ గైనకాలజీ డాక్టర్లు లేకపోవడంతో పీజీ డాక్టర్లే వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసే అసోసియేట్ ప్రొఫెసర్ల విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ దవాఖాన నుంచి బదిలీపై వెళ్లిన వారు ఎంతమంది? పనిచేస్తున్నది ఎవరు? అన్న సమాచారమేలేదు. రూ. లక్షలో జీతాలు తీసుకుంటున్నప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ తమ సొంత ఆస్పత్రులకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నది. డ్యూటీ చేసే డాక్టర్లు ఉదయం 9, సాయం త్రం 4 గంటలకు బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే డాక్టర్లకు వేతనాలు చెల్లిస్తారు. అయితే ఈ విధానం సైతం గందరగోళంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇందులోనూ పలు అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నవజాత శిశువులకు వైద్య సేవలందించే పిల్లల వార్డులో ముగ్గురు నుంచి నలుగురు డాక్టర్లు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏకంగా ఏడుగురు డాక్టర్లు విధులు నిర్వర్తిస్తుండడం విస్మయం కలిగిస్తున్నది. ఎంజీఎం, కేఎంసీ, సీకేఎం ఆస్పత్రుల్లో పీడీయాట్రిక్ డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి ఎవరినీ పంపడం లేదు. వీరు కూడా హాజరు వేసుకొని వారి సొంత దవాఖానలకు వెళ్తున్నారు. ఈ విషయమై కలెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దృష్టి సారించి విధులకు హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
జీఎంహెచ్ డాక్టర్లు రెగ్యులర్‌గా విధులకు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్లు వస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు వివరాలు మెడికల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం), హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు ఆన్లైన్ ద్వారా చేరుతుంది. ఆస్పత్రిలో వైద్య సేవలు అందరికీ అందుతున్నాయి.
– బీ విజయలక్ష్మి, సూపరింటెండెంట్, జీఎంహెచ్