CBSE Class 12 Board Exams : ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో పరీక్షల్ని రద్దు చేసింది. ఈ మేరకు మిడిల్ ఈస్ట్‌లోని ఏడు దేశాల్లో ఉన్న తమ అనుంబంధ విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇండియాకు చెందిన కీలక ప్రభుత్వ విద్యాసంస్థ సీబీఎస్ఈ. ఇండియాతోపాటు భారతీయులు ఎక్కువగా ఉండే విదేశాల్లోనూ స్కూళ్లను నిర్వహిస్తుంది.
ఇండియన్స్ ఎక్కువగా ఉండే ఏడు మిడిల్ ఈస్ట్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఖతార్, ఒమన్, సౌదీ అరేబియాతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సీబీఎస్ఈ అనుబంధ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ దేశాలన్నీ ఇరాన్ యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా అక్కడి జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దీని ఎఫెక్ట్ విద్యావ్యవస్థపై కూడా పడింది. సీబీఎస్ఈకి సంబంధించి క్లాస్ 12 విద్యార్థులకు పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 10 వరకు పరీక్షలు కొనసాగుతాయి. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రం యుద్ధం కారణంగా పరీక్షలు మొదలు కాలేదు. దీంతో ఆయా దేశాల్లో పరీక్షల్ని సీబీఎస్ఈ వరుసగా వాయిదా వేస్తూ వచ్చింది. మార్చి 1, మార్చి 3, మార్చి 5, మార్చి 7, మార్చి 9.. ఇలా పలు తేదీల్లో పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.
అయితే, ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించకపోవడంతో ఏడు దేశాల్లో పరీక్షల్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, వీరికి మార్కులు, ర్యాంకులు ఎలా కేటాయిస్తారు అనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై కూడా బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. పరీక్షలు రద్దైన విద్యార్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితాలకు ఎలాంటి ప్రమాణాల్ని పాటిస్తారో త్వరలోనే క్లారిటీ వస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో 217 సీబీఎస్ఈ స్కూల్స్ నడుస్తున్నాయి.