కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా యూరియా, డీఏపీ, ఎన్పీకే వంటి రసాయన ఎరువుల ఆన్లైన్ బుకింగ్ పంపిణీ కోసం ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఇది ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కు అనుసంధానమై ఉంటుంది. ఎరువుల అక్రమ నిల్వలను నివారించడం, రైతులు అధికంగా ఎరువులను వాడకుండా చూడటమే యాప్ ఉద్దేశమని తెలిపింది. ఎరువుల దుకాణాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా కూడా యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నది. కానీ యాప్‌లో బుకింగ్ చేసుకోవడంలో రైతులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
రైతులు ఎరువులను యాప్‌లో బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలి. ఐడీ లేకపోతే ఆధార్‌తో నమోదు చేసుకోవాలి. ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకానికి అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ చేయాలి. రైతుల భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటల ఆధారంగా ఎరువుల కోటాను యాప్ నమోదు చేస్తుంది. ఆ తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ లేదా టోకెన్‌ను డీలర్‌కు చూపించి బుక్ చేసిన మూడు రోజుల వ్యవధిలో ఎరువులు తీసుకోవాలి. కేంద్రం ఈ యాప్‌ను మహారాష్ట్రలోని పుణెలోని హవేలీ తహసీల్‌లో ట్రయల్ రన్ నిర్వహించింది. ఆ తర్వాత కొల్లాపూర్, ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఆ రెండు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, డీలర్లు సమ్మె చేశారు. గోవాలోనూ రైతులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణలో మొదటి దశలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రారంభించారు. ఆగస్టు 6 నుంచి నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాకు విస్తరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు జారీ చేస్తున్న ఫార్మర్ ఐడి ప్రస్తుతానికి ఐచ్ఛిక ఎంపిక అంటూ భూమి, పంట రకం, ఆధార్ వివరాలతో యాప్ ద్వారా ఎరువులు కేటాయిస్తు న్నది. భవిష్యత్తులో ఫార్మర్ ఐడీ ఉన్న రైతులకే ఎరువుల లభ్యత ఉంటుంది. ఎంతమంది రైతులకు యాప్‌పై అవగాహన ఉంటుంది? డిజిటల్ పరిజ్ఞానం ఎంత? స్మార్ట్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి ఏమిటి? నెట్ వర్క్, సర్వర్‌డౌన్, బుకింగ్ ఫెయిల్, ఓటీపీలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఎలా? అనేది ఆలోచించాలి.
తెలంగాణలో నిరుడు ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో సమస్యలు ఎదురయ్యాయి. ప్రభుత్వం రబీ నుంచి యూరియా యాప్ తీసుకువచ్చింది. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచి సర్వర్ ఓపెన్ కాక, ఓపెన్ అయినా రెండు, మూడు నిముషాల వ్యవధిలోనే కనిపించకుండా పోతున్నది. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి మాత్రమే రైతులకు కొన్ని నిమిషాలే యాప్‌లో ఆప్షన్ కనిపిస్తున్నదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిష్కారం చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌ను చూసే కేంద్రం యాప్ విధానం తీసుకొచ్చిందంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గొప్పలు చెప్తున్నారు. ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వరి, ఇతర పంటల సాగు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అవసరమైన డీఏపీ సరఫరా లేకపోవడంతో కల్తీ డీఏపీ తయారీ ముఠాలు రెచ్చిపోతూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
యూరియా, డీఏపీ సబ్సిడీ భారం నుంచి బయట పడేందుకు నానో యూరియా, నానో డీఏపీ వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ నానో యూరియా, నానో డీఏపీతో సరైన ఫలితాలు రావడం లేదని రైతులు చెప్తున్నారు. దేశంలో నూటికి 92 శాతం మంది రైతులకు రెండున్నర ఎకరాల లోపు సాగు భూమి మాత్రమే ఉన్నది. సన్న, చిన్న కారు రైతులు తమకు ఉన్న కొద్దిపాటి భూమిలో అధిక దిగుబడులు సాధించి తమ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతు కుటుంబాల మనగడకు సరిపడా ఆదాయం కావాలి. రైతులకు మరో ఆదాయం లేదు కదా! మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తెగుళ్లు, వైరస్లు రెచ్చిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగం చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కారణం చూపుతూ ఈ సీజన్లో ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. యూరియా, డీఏపీ మినహా ఏ రకం ఎరువు బస్తా అయినా రూ.2000 పైచిలుకే. కొన్ని ఎరువుల ధరలు రూ 2500 వద్దకు చేరాయి.
ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ భరించే యూరి యా, డీఏపీ ధరలు పెంచకుండా పంపిణీలో కోత విధించేందుకు యాప్‌ను రూపొందించింది. కోటా పరిమితులు, పంటల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన ఎరువుల కోటా సరిపోకపోవచ్చు అని రైతుల ఆందోళన చెందుతున్నారు.
ఎరువులు వేయడానికి కీలకమైన సమయం కోల్పోతున్నారు. దాని వల్ల పంట నష్టపోయే ప్రమాదం ఉన్నది. వివిధ రాష్ర్టాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్తు పంపుసెట్ల వినియోగంతో రెండు పంటలు సాగు చేస్తున్నారు. దీనితో ఎరువుల వినియోగం పెరుగుతున్నది. తెలంగాణలో 2018-19 వ్యవసాయ సీజన్లో 29 లక్షల టన్నుల వినియోగం నుంచి ఇటీవల 41 లక్షల టన్నులకు పెరిగింది.
సబ్సిడీ భారం నుంచి తప్పించుకోవాలని కేం ద్ర ప్రభుత్వానికి ఆలోచన లేకపోతే ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఎంపికలతో హైబ్రిడ్ విధానాన్ని అనుమతి ఇవ్వాలి. రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఎరువుల కొరత వారిని మరింత ఆందోళనను గురిచేస్తున్నది. వ్యవసాయ దిగుబడులు తగ్గి, రైతుల ఆదాయం పడిపోకుండా, ఎరువులు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ఈ మేరకు అవసరమైన నిధులు కేటాయించాలి.