Job Seekers Visa | విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి అమెరికా వీసా నిబంధనలు కఠినతరంగా మారుతున్న సమయంలో.. దుబాయ్ మాత్రం ఉద్యోగార్థులకు ఆసక్తికరమైన అవకాశం కల్పిస్తోంది. జాబ్ ముందుగానే కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ.. దుబాయ్‌కి వెళ్లి అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునే అవకాశం కల్పించింది. ఈ మేరకు జాబ్ సీకర్ వీసాను అందుబాటులో ఉంచింది.
సాధారణంగా విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లాలంటే ముందుగానే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్, స్పాన్సర్ లేదా ఉద్యోగ సంబంధిత అనుమతులు అవసరం అవుతాయి. అయితే యూఏఈ జాబ్ సీకర్ వీసా విషయంలో అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా ఉద్యోగం పొందకుండానే దుబాయ్‌కు వెళ్లి స్థానిక లేబర్ మార్కెట్లో ఉద్యోగ అవకాశాలను నేరుగా వెతుక్కోవచ్చు.
ఆన్లైన్లో దూరం నుంచే ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం కాకుండా.. దుబాయ్‌లోనే ఉండి కంపెనీలను సంప్రదించడం, ఇంటర్వ్యూలకు హాజరు కావడం, రిక్రూటర్లను కలవడం, తమ రంగంలో ఉన్న సంస్థలతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఈ వీసా ద్వారా సాధ్యమవుతుంది.
జాబ్ సీకర్స్ తమ అవసరానికి అనుగుణంగా 60, 90 లేదా 120 రోజుల వీసా వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంది. నిబంధనలు, అనుమతులకు లోబడి కొన్ని సందర్భాల్లో దీనిని 180 రోజుల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది.
అమెరికాలో విదేశీ ఉద్యోగుల వీసాల విషయంలో నిబంధనలు, పరిశీలనలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో.. యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించాలనుకునే వారికి ఈ విధానం ఆకర్షణీయంగా మారుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, నిర్మాణం, ఇతర ప్రొఫెషనల్ రంగాల్లో తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని భావించే వారికి అక్కడి మార్కెట్‌ను నేరుగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అయితే జాబ్ సీకర్ వీసా అంటే ఉద్యోగం గ్యారంటీ కాదు. దుబాయ్‌లోకి వెళ్లేందుకు, ఉద్యోగం వెతికేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది కానీ ఉద్యోగ నియామకం మాత్రం అభ్యర్థి అర్హతలు, కంపెనీ అవసరాలు, నియామక ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.