హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్‌కు మాత్రం కుంటిసాకులు చెబుతూ అనుమతులను తిరస్కరిస్తూ వస్తున్నది. ట్రిబ్యునల్ విచారణలో ఉన్న నేపథ్యంలో అనుమతులివ్వలేం.. డీపీఆర్‌ను పరిశీలించలేమంటూ తొలుత కేంద్రం తిప్పిపంపింది. ఆ తరువాత ఏపీ సర్కార్ పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును తెరమీదకు తె చ్చింది. ఈ నేపథ్యంలో పాలమూరుకు ఎన్వో సీ ఇస్తే బనకచర్ల ప్రాజెక్టు అనుమతులకు తెల ంగాణను ఒప్పిస్తామని కేంద్రమే మధ్యవర్తి త్వం నెరపడం ప్రారంభించింది. చర్చలు కొనసాగించింది. సీఎం రేవంత్ సైతం ఆ ప్రతిపాదనలకు జై కొడుతూ.. ఎన్వోసీ తీసుకొస్తామ ని, తీపికబురు చెబుతామని పదే పదే ఊదరగొడుతున్నారు. మొత్తంగా బనకచర్ల కోసమే ‘పాలమూరు’ను ఫణంగా పెడుతున్నారని తేటతెల్లమైపోతున్నది. రాజ్యసభలో తాజాగా కేంద్రం వెల్లడించిన అంశాలతో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు తాజాగా మరోసారి బట్టబయలయ్యాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మైనర్ ఇరిగేషన్లో వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను మొత్తం గా 90 టీఎంసీల నికర జలాలను ప్రాజెక్టుకు కేటాయించి, డీపీఆర్‌ను 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి (కేంద్ర జలసంఘం) సమర్పించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) సైతం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సి ఫార్సు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న తరువాత 2024 డిసెంబర్లో అప్రయిజల్ లిస్ట్ నుంచి పాలమూరు డీపీఆర్‌ను కేంద్రం తొలగించింది. ప్రాజెక్టు అంశంపై ట్రిబ్యునల్ ఎదుట విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అనుమతులివ్వలేమని పేర్కొన్నది. తాజాగా పార్లమెంట్లో కూడా కేంద్ర జల్‌శక్తి శాఖ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టంచేసింది. వాస్తవమేమంటే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే, న్యాయ వివాదంలో కొనసాగుతుండగానే కర్ణాటక, మహారాష్ట్ర చేపట్టిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో కేంద్రమే అనుమతులు మంజూరు చేసింది.
అప్పర్‌భద్ర, అప్పర్కృష్ణ స్టేజీ-3(ఆల్మట్టి), అప్పర్తుంగతో పాటు ఆ జాబితాలో మహారాష్ట్రకు చెందిన పదుల సంఖ్యలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాదు, అప్పర్‌భద్ర, అప్పర్‌తుంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల అం శంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దా ఖలుకాగా, దాని మీద విచారణ కొనసాగుతున్నది. ట్రిబ్యునల్-2 అవార్డు సైతం అమల్లోకి రాలేదు. అయినప్పటికీ, అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు టీఏసీ అనుమతులను కేంద్రం మం జూరు చేయడంతోపాటు జాతీయహోదా ప్రకటించింది. గతంలో కృష్ణాబేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు జలాలను మళ్లించే హంద్రీనీవా సు జల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్), గాలేరు నగ రి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), వెలిగొం డ, మల్యాల, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణ పనులపై, ఆయా ప్రాజెక్టులపై కర్ణాటక, మహారాష్ట్ర సర్కార్లు ట్రిబ్యునల్‌లో ఫిర్యా దు చేశాయి. ప్రాజెక్టులు నిర్మించుకున్నా ట్రి బ్యునల్ అవార్డుకు కట్టుబడి ఉండాలని షర తు విధిస్తూ కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇలా షరతులో కూడిన అనుమతులను మంజూరు చేయడం పరిపాటి. ఆ అవకాశం ఉన్నప్పటికీ పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం అనుతులు ఇవ్వకుండా నాన్చుతున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టు. అత్యంత కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించే ఇన్ బేసిన్ ప్రాజెక్టు. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా కృష్ణా జలాల కేటాయింపులో తొలి ప్రాధాన్యత దక్కే ప్రాజెక్టు. అయినా జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం కుంటిసాకులు చూపుతున్నది.