వరంగల్‌చౌరస్తా, ఏప్రిల్ 1 : పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వంలో కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన సూపర్‌స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవల్లో డొల్ల తనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన యంత్రాలు, పరికరాలు ప్రస్తుతం రసాయనాలు లేక వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్పెషాలిటీ విభాగాలను ఎంజీఎంహెచ్ నుంచి కేఎంసీకి మార్చారు.
అయితే సీటీ స్కాన్ తీసే క్రమంలో ఒకే విభాగం నుంచి వచ్చే రోగులకే కాంట్రాస్ట్ రసాయనం వినియోగిస్తున్నారని, తాము పంపే పేషెంట్లకు రసాయనం లేదని స్కాన్ తీయడంలేదని ఇతర విభాగాల వారు ఆరోపించినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు రసాయనాన్ని విభాగాల వారీగా ఇచ్చేందుకు నిర్ణయించి ఇండెంట్లో కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు సీటీ స్కాన్ రిఫర్ చేసిన ప్రతి పేషెంట్‌కు స్కానింగ్‌కు వెళ్లేముందే కాంట్రస్ట్ రసాయనాన్ని వెంట తీసుకెళ్లాల్సి వస్తున్నది. హాస్పిటల్ మొత్తానికి ఒకే యంత్రాన్ని వినియోగిస్తున్నప్పుడు రసాయనాన్ని మాత్రం విభాగాల వారీగా కేటాయించడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొంతమేరనే రసాయనం కేటాయిస్తుండంతో అవసరం ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోతున్నదని ఆయా విభాగాల సిబ్బందే చెప్తున్నారు. రసాయనాల కొరత కారణంగా రోజుల తరబడి రేడియాలజీ విభాగం చుట్టూ తిరగాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. ఇదే అదనుగా కొందరు సిబ్బంది వేల రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదులు అందినా వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు సమస్యపై దృష్టి సారించి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.