భీమదేవరపల్లి, ఆగస్టు 20: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రహమాన్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కాశతుర్ఖ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా చలి జ్వరం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది మోహన్, స్వరూప, ఆశా కార్యకర్తలు రజిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.