కొడకండ్ల, ఫిబ్రవరి 27 : పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి(26)కి కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థి ప్రీతి నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి మృతిచెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన గిర్నితండాకు తీసుకురాగా, మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కంటికోధారగా విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా.. తల్లీ అంటూ రోదించిన తీరు గ్రామస్తులకు కన్నీళ్లు పెట్టించింది. ప్రీతిని చివరిసారిగా చూసేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకున్నది. వివిధ పార్టీల నాయకులు ప్రీతి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అనంతరం ట్రాక్టర్లో మృతదేహాన్ని తీసుకెళ్లి వారి వ్యవసాయ భూమిలో ఖననం చేశారు. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే ఆర్పీఎఫ్ ఏఎస్సై కాగా, తల్లి శారద గృహిణి. తండ్రి రైల్వే ఆర్పీఎఫ్ ఏఎస్సై కావడంతో ప్రీతి చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. ఆమెకు పూజ, ఉష అనే ఇద్దరు అక్కలు, తమ్ముడు వంశీ ఉన్నారు. ఇద్దరు అక్కల వివాహం జరిగింది. ప్రీతి పదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువులో చురుగ్గా ఉండేది. మొదటి దఫాలోనే కామినేని మెడికల్ కాలేజీలోఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎంబీబీఎస్ అనంతరం కరోనా సమయంలో సికింద్రాబాద్ రైల్వే దవాఖానలో సేవలందించి సేవా గుణాన్ని చాటుకున్నది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా ఉద్యోగం వచ్చినా అందులో చేరకుండా, తనకిష్టమైన అనస్తీషియా విభాగంలో పీజీ చేయాలనుకున్నది. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు రాగా గత సంవత్సరం చేరింది. నరేందర్ స్వగ్రా మం గిర్నితండా అయినా ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని బోడుప్పల్లో నివాసముంటున్నాడు. వ్యవసాయ భూము లు తప్ప గిర్నితండాలో సొంత ఇల్లు లేదు. తన తండ్రుల కాలంనాటి పాత ఇల్లు ఒకటి ఉంది. నరేందర్ సోదరులు ప్రస్తుతం గిర్నితండలోనే ఉంటున్నారు. ప్రీతి మృతి బాధాకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గిర్నితండా సర్పంచ్ రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
నా బిడ్డది ఆత్మహత్య కాదు.. హత్యే..
మృతురాలి తండ్రి నరేందర్‌నాయక్
‘ప్రీతి ఆత్మహ్యత చేసుకునేంత పిరికిది కాదు.. ఇది ముమ్మాటికి హత్యే.. సంఘటన జరిగిన నాటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. పోలీసులు పూర్తి విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న.. సీనియర్ల ర్యాగింగ్ వల్లే నా బిడ్డ చనిపోయిందని అంటే నమ్మలేక పోతున్నామని ప్రీతి తండ్రి నరేందర్‌నాయక్ తెలిపారు. తమ ఇంట్లో పెళ్లి ఉండడంతో చెప్పలేక పోయిందన్నారు. తాను హాస్టల్‌కు పోయిన రోజు కూ డా ఏడుస్తూ చాలా హరాస్ చేస్తున్నరు డాడి అని చెప్పింది.. అయినా ధైర్యంగా ఉంది.. కానీ, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేక పోతున్న. ఇది కచ్చితంగా హత్యే అనిపిస్తున్నది.