ఏటూరునాగారం, జూలై 23: ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుతున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సోమవారం పీవో సమీక్షించారు. ఫిర్యాదులపై సమీక్షించి పిటిషనర్లు రెండు సార్లు ఐటీడీఏను సందర్శించకుండా, త్వరగా పరిష్కరించాలని ఏపీవో వసంతరావుకు సూచించారు. గిరిజన దర్బార్, సమీక్షకు అనుమతి లేకుండా గైర్హాజరైన టీఎస్ఎన్పీడీసీఎల్ ఏడీఏ, ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏవో దామోదర్స్వామిని ఆదేశించారు. గ్రామాల్లో ఆవాసాల మధ్య వర్షపు నీరు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దృష్టిసారించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో క్రాంతికుమార్, ఎంపీడీవోలను ఆదేశించారు.
ప్రస్తుతం పంచాయతీ కార్మికులు సమ్మెలో ఉన్నందున ప్రైవేట్ లేబర్‌తో పనులు చేయిస్తున్నట్లు ఎంపీడీవోలు తెలిపారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్టికల్ 275 కొత్త బైక్ అంబులెన్స్‌లు మంజూరయ్యాయని, అవి అవసరమయ్యే ప్రదేశాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో క్రాంతికుమార్‌ను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో బర్త్ వెయిటింగ్ హాల్స్ నిర్మాణం స్థితిగతులపై ఆరా తీశారు. సకాలంలో భవనాల పూర్తికి ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గురుకులాల అధికారులతో విద్యార్థుల హాజరు శాతం, జీసీసీ సరఫరా చేసే నిత్యావసర సరుకుల అంశాలపై అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్టీలను పెంచినందున వెంటనే కొత్త డైట్చార్టీల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు.
ఏటూరునాగారం, కాటారం, జాకారంలోని యువజన శిక్షణా కేంద్రాల్లో సాంకేతిక కోర్సులను ప్రారంభించాలని, రెండు వారాల్లో కాటారంలోని యువజన శిక్షణ కేంద్రంలో జాబ్‌మేళాకు ఏర్పాట్లు చేయాలని, కనీసం వంద మంది ఉద్యోగాలు పొందేలా ప్లాన్ చేయాలని, ఎక్కువ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలని జేడీఎం కొండల్‌రావును ఆదేశించారు. ట్రైకార్ ద్వారా గిరిజనులకు అందించే ఆర్థికసహాయ పథకాల అమలు తీరుపై ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల ఎంపీడీవోలతో చర్చించారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అతి త్వరలో పెండింగ్ లేకుండా దరఖాస్తులను ఐటీడీఏ లాగిన్‌కు ఫార్వర్డ్ చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో చిన్న మరమ్మతులను వెంటనే చేయించాలని ఈఈ హేమలతను ఆదేశించారు.
మేడారం పాఠశాలలో గోడలకు కరెంట్ షాక్ వస్తున్నట్లు జీసీడీవో సుగుణ తెలుపగా, వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఈఈని పీవో ఆదేశించారు. కొన్ని హాస్టల్స్‌లో నాణ్యతలేని ట్యాప్స్‌ను బిగించినట్లు తాను గుర్తించానని, క్వాలిటీ ఉండేవి వాడేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం వివరణాత్మకమైన ప్రాజెక్టు నివేదికలను తయారు చేసి, ఉమ్మడి ఖాతాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఏపీవో వసంతరావు, జేడీఎంను ఆదేశించారు. సమీక్షలో డీడీ పోచం, ఏవో దామోదర్‌స్వామి, మేనేజర్ శ్రీనువాస్, ఎస్వో రాజ్‌కుమార్, ఏసీఎంవో రవీందర్ పాల్గొన్నారు.