Medaram Jathara | తాడ్వాయి, ఫిబ్రవరి11 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నందున వారికి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. ఆదివారం మంత్రి తల్లుల సన్నిధిలో మొక్కులు చెల్లించారు.
అనంతరం సీతక్క మాట్లాడుతూ జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈనెల 23న సీఎం రేవంత్రెడ్డి, గవర్నర్, రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భక్తుల కోసం యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. జంపన్నవాగు, స్నానఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ అన్ని పనులను పూర్తిచేసినట్లు మంత్రి వివరించారు. ఆమె వెంట కలెక్టర్ ఇలాత్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ శ్రీజ ఉన్నారు