రాష్ట్ర విభజన హామీల్లో ఒక్కటైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగులో ఏర్పాటుచేయాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ పోరాటాలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నోమార్లు విన్నవించినా పట్టని మోదీ సర్కారు.. తీరా ఎన్నికలు సమీపించిన వేళ గిమ్మిక్కులు చేస్తూ తెలంగాణపై ఎక్కడలేని ప్రేమను చూపిస్తున్నది. మొదటీనుంచి ‘తెలంగాణ ఏర్పాటు’పై విషం కక్కుతున్న ప్రధాని.. జనం ఓట్ల కోసం సీట్ల కోసం ఎట్టకేలకు ట్రైబల్ యూనివర్సిటీపై ప్రకటన చేశారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగులో ఐదేళ్ల క్రితం స్థలం కేటాయించి కేంద్రానికి అప్పగించినా తాత్సారం చేస్తూ వచ్చింది తప్ప ఎలాంటి స్పందన లేకపోవడంపై రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సమయం వచ్చినప్పుడల్లా నిరసనలు తెలిపారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఫలితంగా గిరిజనులకు ఉన్నత విద్య సాకారం కానుండడంపై ములుగు ఏజెన్సీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– ములుగు, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ)
Tribal University | ములుగు, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ సర్కారు పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాల్సి ఉన్నా పదేళ్లుగా కాలయాపన చేసిన మోదీ ప్రభుత్వం.. ఎన్నికల వేళ తప్పని పరిస్థితుల్లో ట్రైబల్ వర్సిటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈమేరకు మహబూబ్నగర్లో ప్రధాని మోదీ ఈమేరకు ప్రకటన చేశారు. మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు రూ.900 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని ములుగు జిల్లాకేంద్రంలోని గట్టమ్మ దేవాలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నది. ములుగు కేంద్రంగా ఏర్పాటయ్యే యూనివర్సిటీ రాష్ర్టానికి తలమానికం కానున్నది.
బీఆర్ఎస్ పోరాటాలతో దిగొచ్చిన కేంద్రం
ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టమైన సెక్షన్ 93 షెడ్యూల్ 13(3) ప్రకారం తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన గిరిజ న యూనివర్సిటీ కోసం బీఆర్ఎస్ సర్కారు అనేక పోరాటాలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర మం త్రులు, ఎంపీలు కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తులు చేయడంతో పాటు వివిధ రూపాల్లో నిరసనలు కూడా తెలుపడంతో ఇన్నాళ్లకు మోదీ సర్కారు దిగిచ్చిం ది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండోసారి ము ఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నోసార్లు యూనివర్సిటీ విషయమై చర్చించారు. ఇందులో భాగంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ 2018 డిసెంబర్ 31న యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేటాయించిన భూములను పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు యూనివర్సిటీ ఏర్పాటు, తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని వైటీసీ భవనాన్ని సైతం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీ భూములను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన ఇన్నాళ్లకు ప్రధాని ఆదివారం ప్రకటించారు. ఈ యూనివర్సిటీకి మేడారం సమ్మక్క సారలమ్మల పేర్లతో నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.900కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రధాని సభలో ప్రకటించారు.
335.04 ఎకరాల స్థలం కేటాయింపు
యూనివర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల భూమిని కేటాయించింది. తొలుత కేంద్రం 500 ఎకరాల అవసరముందని నివేదించగా రెవెన్యూ, ఫారెస్టు శాఖకు సంబంధించి 487ఎకరాల 4గుంటల భూమిని గుర్తించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యం త్రాంగం రెవెన్యూకు సంబంధించిన సర్వే నంబర్ 837లోని 274 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులతో, సిబ్బందితో కలిసి సర్వే చేసి 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ భూములకు సంబంధించి అధికారులు జీపీఎస్ సర్వే కూడా చేయించారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31న కేంద్ర ఉన్నత వి ద్యాశాఖ కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉప కులపతి అప్పారావు, సెం ట్రల్ పబ్లిక్ వర్సిటీ సీఈ సాంబశివరావుల బృందం జి ల్లాలో పర్యటించి కేటాయించిన భూములు యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైనవని కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ఫారెస్టు, రె వెన్యూ శాఖలకు సంబంధించిన 335.04ఎకరాల ప్రభు త్వ భూమిని సిద్ధం చేసి కేంద్ర మానవ వనరుల అభివృ ద్ధి శాఖకు అప్పగించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గత రెండు బడ్జెట్లలో ఇప్పటివరకు రూ.19కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషించి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో సదరు స్థలానికి శాశ్వత ప్రాతిపదికన హద్దు రాళ్లు అమర్చారు.
ప్రపంచ చరిత్రలో ములుగుకు చోటు
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ హయాంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ నూతన జిల్లాగా రూపాంతరం చెందడంతో పాటు దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రంగా మారనున్నది. ప్రపంచ చరిత్రలో ములుగు చోటు సంపాదించుకోనుంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్టంక్ జిల్లాలో మొదటి గిరిజన యూ నివర్సిటీ రూ.1100కోట్ల వ్యయంతో నెలకొల్పగా రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. కాగా, ప్రస్తుతం ములుగులో అంతకు మించిన వ్యయంతో 3వ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటై ములుగు జిల్లాకు కలికితురాయిగా మారనున్నది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కాకతీయుల నాటి అతిపెద్ద సరస్సులు అయిన రామప్ప, లక్నవరం అందుబాటులో ఉన్నాయి. దీనికి తోటు ములుగులో లోకం చెరువు సైతం యూనివర్సిటీ స్థలాలకు ఆనుకొని ఉండడం విశేషం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 163వ జాతీయ రహదారికి ఆనుకొని రవాణా పరంగా సైతం ఎలాంటి ఇబ్బందులు లేవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు, సిబ్బందికి గంట సమయంలో వరంగల్లోని రైల్వేస్టేషన్ మార్గం ద్వారా, త్వరలో మామునూరులో అభివృద్ధి చెందనున్న విమానాశ్రయానికి సైతం చేరుకోవచ్చు. కేంద్రంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పోరాటాల ఫలితంగా జిల్లాలో ఏర్పాటయ్యే గిరిజన విశ్వవిద్యాలయం ఈ ప్రాంత గిరిజన విద్యార్థులతో పాటు ఇతర ప్రాంతాల విద్యార్థులకు, స్థానికులకు వరంగా మారనున్నది.