తాడ్వాయి, ఫిబ్రవరి 18 : వనదేవతలు కొలువైన మేడారం జాతర పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆదివారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో అటవీ ప్రాంతం జనారణ్యంగా మారింది. రోజంతా భక్తుల రాకపోకలతో మేడారం దారులు కిక్కిరిసిపోయాయి. జాతర పరిసరాలు భక్తుల గుడారాలతో నిండిపోయాయి. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, వాగు ఒడ్డునున్న జంపన్న, నాగులమ్మ గద్దెలకు మొక్కులు చెల్లించి కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించారు. అనంతరం తల్లుల గద్దెలకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం (బెల్లం), నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలను చల్లంగా చూడాలని కోరుకున్నారు.
వనదేవతలు సమ్మక్క సారలమ్మలను ఆదివారం మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన వారు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై గిరిజన సంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు (నమస్తే తెలంగాణ) : మేడారం సమ్మక్క, సారలమ్మకు రెండు నెలల నుంచి 50 లక్షల మంది భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించారని ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 24 వరకు మరో కోటి మంది భక్తులు వచ్చే అవకాశముందన్నారు. మహా జాతరకు పోలీస్ శాఖ పూర్తి సన్నద్ధమైందని, జిల్లా యంత్రాంగంతో మమేకమై పనిచేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.