తాడ్వాయి, ఫిబ్రవరి 9 : మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారులు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. పూజారులు సిద్దబోయిన మునీందర్, క్రిష్ణయ్య సమ్మక్క పూజా మందిరంలో మొదట తల్లి గద్దెను, అనంతరం పూజా సామగ్రిని శుద్ధి చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారుల కుటుంబాలకు చెందిన ఆడపడుచులు తల్లి గద్దెకు అలుకుపూతలు నిర్వహించి ముగ్గులతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసి, డోలు వాయిద్యాల నడుమ బొడ్రాయి, పోచమ్మ గుళ్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో మామిడి తోరణాలు, ఆనపకాయ బుర్రతోపాటు కోడిపిల్లను కట్టి ఎలాంటి దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా కట్టు వేశారు. ధ్వజస్తంభాల వద్ద కల్లు సాకను ఆరబోశారు. సమ్మక్క పూజా మందిరానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని అలుకుపూతలు నిర్వహించి చెలపెయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండమెలిగే పండుగతో మహాజాతర ప్రారంభమైనట్లు పూజారులు సంకేతాలు ఇచ్చారు.
కన్నెపల్లిలోని సారలమ్మ పూజారి కాక సారయ్య అమ్మవారి పూజా మందిరం, సామగ్రిని శుద్ధి చేశారు. గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడేరాలకు చీరె, సారెను సమర్పించి పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు నిర్వహించారు.
మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో మండ మెలిగే పండగను నిర్వహించిన పూజారులు రాత్రి గద్దెల వద్ద జాగారాలు చేయనున్నారు. కన్నెపల్లి నుంచి సారక్క పూజారులు, మేడారం నుంచి సమ్మక్క పూజారులు రాత్రి 8గంటల సమయంలో తల్లుల గద్దెల వద్దకు చేరుకుంటారు. ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుని రహస్య పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రంతా గద్దెల ఆవరణలో జాగారాలు చేసి గురువారం తెల్లవారుజామున ఆయా పూజా మందిరాలకు చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం ఇళ్లకు చేరుకుంటారు. ఈ పండుగతో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువచ్చే పూజారి కాక సారయ్య అత్యంత నియమనిష్టలతో ఉంటారు. మహా జాతర ముగిసిన అనంతరం వచ్చే బుధవారం వరకు అమ్మవార్ల మందిరాల్లో రోజూ దూపదీప నైవేద్యాలు, సమర్పించనున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజారుల పూజా కార్యక్రమాలు ఉన్న కారణంగా రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు భక్తులను వన దేవతనను దర్శించుకునేందుకు అనుమతించరు.