ములుగు, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ముందస్తు మొక్కుల కోసం మేడారం వచ్చిన భక్తులకు బస్సులు కరువయ్యాయి. తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు లేక గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. మేడారం వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్లో గురువారం తిరుగు ప్రయాణం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రెండు, మూడు గంటలకు ఒక బస్సు రావడంతో భక్తులు ఒక్కసారిగా ఎగబడి సీట్ల కోసం కుస్తీ పడ్డారు. కుటుంబ సమేతంగా వచ్చిన వారికి సీట్లు దొరకకపోవడంతో మరో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు.
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పెద్దఎత్తున జాతరకు వస్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భక్తులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు మేడారానికి తరలించిన విధంగా తిరుగు ప్రయాణంలో రద్దీకనుగుణంగా బస్సులు నడిపిస్తే ఇబ్బందులు ఉండవని వాపోతున్నారు. కలెక్టర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు.