వరంగల్, డిసెంబర్ 27 : మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఉదయం 11.45 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బల్దియా సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కౌన్సిల్ హాజరయ్యారు. తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ కౌన్సిల్ సమావేశానికి హాజరుకాలేదు. సభ ప్రారంభం కాగానే మేయర్ సుధారాణి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలకు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ మంత్రి కొండా సురేఖ హాజరుకానందున మరో సమావేశంలో చేయనున్నట్లు తెలిసింది.
కౌన్సిల్లో నాలుగు ఎజెండా అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విధి నిర్వహణలో మృతిచెందిన ప్రజారోగ్య, మలేరియా విభాగాలకు చెందిన కార్మికులు ఎర్ర స్వామి, మైదం జనార్దన్, ఎర్ర రాజుల కుటుంబాలకు రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, ఇంజినీరింగ్ విభాగం తాగునీటి నిర్వహణ కోసం మూడు ఫిల్టర్బెడ్లలో హెచ్‌పీ పంపులు, వ్యాక్యూమ్ పంపులు, మోటార్ సెట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.93 కోట్లతో కొనుగోలు చేసేందుకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపారు. బల్దియా సర్వసభ్య సమావేశం గంటలో ముగిసింది. మధ్యలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గుండేటి నరేందర్‌కుమార్ మాత్రం కార్పొరేషన్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, కార్మికులకు చీపుర్లు లేక పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదని ఆరోపించారు. దీనిపై బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయని ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు.
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పాలక వర్గానికి, వరంగల్ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. వివిధ గ్రాంట్ల ద్వారా రావాల్సిన నిధులను ప్రభుత్వ నుంచి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజవర్గంలోని మూడు డివిజన్లు గ్రేటర్లో ఉన్నాయని, వాటికి నిధులు ఇవ్వాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడూతూ ఐనవోలు జాతరకు కార్పొరేషన్ సహకారం అందించాలన్నారు.
రాబోయే రోజుల్లో గ్రేటర్లో రోజూ 24గంటల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు. గత రెండున్నరేళ్ల పాలకవర్గ కాలంలో నగరాన్ని అభివృద్ధిలో తీసుకపోతున్నామని పేర్కొన్నారు. నగరాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపేలా సహకరించాలని కోరారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో డివిజన్లలో పటిష్ట ప్రణాళికలతో పారిశుధ్య పనులు నిర్వహించేలా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు.