నమస్తే నెట్వర్క్, మే 1: మేడే సందర్భంగా కార్మికలోకం కదం తొక్కింది. ఊరూరా ర్యాలీలు తీసి జెండావిష్కరణలు చేసింది. బీఆర్ఎస్వీ, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని అరుణ పతాకాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను అడ్డుకోవడానికి మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. హనుమకొండలోని లషర్బజార్ వద్ద హమాలీలు, ప్లంబింగ్ వరర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఎర్రజెండా ఎగురవేశారు.