వరంగల్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మే 6, 2022. వరంగల్ గడ్డమీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేసి న రోజు. సరిగ్గా నాలుగేండ్ల క్రితం ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో అమలు అయిందెంత? ఎగ్గొట్టింది ఎం త? రైతుకు కలిగిన ప్రయోజనం ఎంత? కాంగ్రెస్ పొందిన ఫాయిదా ఎంత? మోసపోయింది ఎవరు? దోఖా చేసిందెవరు? గోసపడుతున్నదెవరు? రైతుల గొంతు కోసిందెవరు? వంటి ప్రశ్నలను రైతాంగం సంధిస్తున్నది. ప్రశ్నించే రైతన్నకు బీఆర్ఎస్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాలుగేండ్ల క్రితం రైతు డిక్లరేషన్ విడుదల చేసిన రోజే బీఆర్ఎస్ రైతు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ సమావేశానికి తప్పక హాజరవుతానని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అనుసరిస్తున్న వైఖరి, తద్వారా ఆయా వర్గాలకు కలుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ జిల్లా నాయకత్వానికి పిలుపునిచ్చారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట నాలుగు ఏండ్ల కిందట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా కనీసం ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కపట మోసాన్ని కొనసాగిస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధా న్యం కొనుగోళ్లలో తీవ్రమైన సంక్షేమం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ పాలనలో తిరి గి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ధాన్యం, మకజొన్న కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని వరంగల్ జిల్లా నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా వ్యాప్తంగా ఎకడికకడ నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నేతలతో హైదరాబాద్‌లో కేటీఆర్ సమావేశం అయ్యారు. శాసనమండలి విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజ య్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమా ర్, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, బానోత్ శంకర్‌నాయక్, న న్నపునేని నరేందర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, బడే నాగజ్యోతి, ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు తదితరులు హాజరైన ఈ సమావేశంలో కేటీఆర్ పలు అంశాల్లో దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపే తం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నేత లు కేటీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపై కేటీఆర్ కీలక సూచనలు చేశారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెష ల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని. ప్రతి బూత్ లో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కేటీఆర్ నేతలకు సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని కొత్త ఓటర్లను నమోదు చేయించాలని, అలాగే ఏ ఒక్కరు ఓ టు హకు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అందుకోసం బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశం అనంతరం శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్ మీడియాతో మాట్లాడారు.
పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనకపోవడంతో దళారుల చేతిలో రై తులు మోసపోతున్నారు. రేవంత్ స ర్కార్ చేతగానితనంతో అన్నదాత లు తాము పండించిన పంటను అడ్డికిపావుసేరు అమ్ముకుంటున్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అని తేలిపోయింది.
– డాక్టర్ టీ. రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం
రైతు నష్టాన్ని కాంగ్రెస్ సర్కారే భరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పంటలు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఏడెనిమిది వేల కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నారు. ఆ నష్టాన్ని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి భరించాలి. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరును వరంగల్ గడ్డపై నిలదీస్తామన్నారు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఆకుపచ్చ తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ ఆగం చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన ఒక్క హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. రాష్ట్రంలో విధ్వంసపాలన సాగుతున్నది. ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేసిన ఎత్తులు, విడుదల చేసిన డిక్లరేషన్లలో రైతు డిక్లరేషన్ ద్రోహపూరిత డిక్లరేషన్ అని అనుభవంలోకి వచ్చింది. ఇదే విషయాన్ని మే 6న అదే వరంగల్ గడ్డపై రైతాంగాని కి వివరిస్తాం. రాష్ట్రంలో విశ్వసనీయత లేని ప్రభుత్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్ దుర్మార్గం, ద్రోహం అని తేలిపోయింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేస్తే రేవంత్ వచ్చిన రెండున్నరేండ్లలో దండుగలా మారిపోయింది. కాంగ్రెస్ మోసాన్ని, ద్రోహాన్ని, దాష్టీకాలను ఎండగడతాం.
– సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలిలో విపక్షనేత
నాలుగేండ్ల కింద రాహుల్‌గాంధీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చేసిన రైతు డిక్లరేషన్ ఎటుపాయె. ఈ విషయాన్ని మే 6న నిలదీస్తాం. కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుబంధు, రైతుబీమా, సకాలంలో విత్తనాలు, యూరియా వచ్చేవి. ఇవాళ రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండున్నరేళ్లుగా అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పండించిన పంటలో సగం కూడా కొనలేని చేతగాని సర్కార్ రాష్ట్రంలో ఉంది.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ